చిత్తూరులో పరువు హత్య? | Young woman incident recently came to light in Chittoor city | Sakshi
Sakshi News home page

చిత్తూరులో పరువు హత్య?

Apr 17 2025 2:39 AM | Updated on Apr 17 2025 5:08 AM

Young woman incident recently came to light in Chittoor city

యాస్మిన్‌ భాను మృతి కేసులో మలుపు

మతాంతర వివాహం చేసుకుందని హతమార్చిన తండ్రి?

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు 

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతో కుటుంబ సభ్యులే యువతిని కడతేర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్‌ అలీ చిత్తూరు మండలం తుమ్మిందలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడి మూడో కుమార్తె యాస్మిన్‌ భాను (26) బీటెక్‌ చదువుతుండగా పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన దళిత యువకుడు సాయితేజను ప్రేమించింది. 

ప్రేమ విషయం పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న యాస్మిన్‌ భానుకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో సాయితేజను పెళ్లి చేసు­కో­వాలని నిశ్చయించుకున్న యాస్మిన్‌.. ఫిబ్రవరి 6న ఇంటినుంచి వెళ్లిపోయి సాయితేజను పెళ్లి చేసుకుంది. అనంతరం సాయితేజ, యాస్మిన్‌ పూతలపట్టులోని పోటు కనుమలో కాపురం పెట్టారు.  

ఇంటికి పిలిచి మరీ చంపేశారు 
ఆ తరువాత తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు, కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లు చేసి యాస్మిన్‌తో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓసారి షౌకత్‌ అలీ గడ్డంతో ఉండటాన్ని చూపించి ‘నీ తండ్రి బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఓసారి  ఇంటికి రా’ అని కుటుంబ సభ్యులు యాస్మిన్‌ను కోరగా ఆమె అంగీకరించింది. దీంతో సాయితేజ ఈ నెల 13న యాస్మిన్‌ను ఆమె బంధువుల ద్వారా ఇంటికి పంపించాడు. 

ఆ తరువాత కుటుంబ సభ్యుల సాయంతో యాస్మిన్‌ పీకకు తాడు బిగించి తండ్రి షౌకత్‌ అలీ చంపేసి.. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. 

ఓ కారును స్వాదీనం చేసుకుని, షౌకత్‌ అలీ, యాస్మిన్‌ అన్న లాలా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కుల మతాలు వేరుకావడంతో పరువుపోయిందని భావించి యాస్మిన్‌ను ఆమె తండ్రి షౌకత్‌ అలీ తాడుతో పీక బిగించి హత్య చేశాడని ఆమె భర్త సాయితేజ ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం ఆస్పత్రి వద్ద యాస్మిన్‌ తల్లి కూడా చెప్పిందన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement