Kotamreddy Sridhar Reddy: మాటిచ్చాడు.. కంటిచూపు తెప్పించాడు..

సాక్షి, నెల్లూరు రూరల్: ఆ యువతికి పేదరికం శాపంగా మారడంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా కంటి చూపులేక నరకం చూసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో ఆ యువతి నేడు రంగుల ప్రపంచాన్ని ఆనందంగా చూస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామం అరుంధతీయవాడకు చెందిన బైరపోగు శీనయ్య, రత్నమ్మ కుమార్తె బి.కామక్షమ్మ (20) పుట్టుకతో అంధురాలు. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే పాత వెల్లంటికి వెళ్లారు. అరుంధతీయవాడలో పాదయాత్ర చేస్తుండగా కామాక్షమ్మ కంటిచూపు లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో ఖరీదైన వైద్యం చేయించి కంటిచూపు తెప్పిస్తాని హామీ ఇచ్చారు. ఈక్రమంలో నగరంలోని మోడరన్ ఐ హాస్పిటల్‌లో వైద్యులు కొద్దిరోజుల క్రితం కామాక్షమ్మ ఒక కంటికి ఆపరేషన్ చేసి కంటి చూపును తెప్పించారు.
చదవండి: (రహదారులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..)
తిరిగి రెండో కంటికి బుధవారం ఆపరేషన్ నిర్వహించగా విజయవంతమైంది. తనకు కంటి చూపు వచ్చిన వెంటనే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చూడాలని కామాక్షమ్మ కోరారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కామాక్షమ్మను పరామర్శించారు. తనకు కంటి చూపు వస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందని ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి ఆదుకున్నారని యువతి తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. ఒక్కమాటతో కొత్త జీవితాన్నిచ్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.