కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ కథనాలు 

Yellow Media False News on Dharmavaram MLA - Sakshi

తప్పుడు రాతలతో విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా 

అధికారులను పావులుగా చేస్తూ అబద్ధపు రాతలు 

అధికారులు ఖండించినా ఆగని విషప్రచారం  

సాక్షి, ధర్మవరం: ఎల్లో మీడియా బరితెగించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ విషపు రాతలతో జనానికి కనికట్టు కడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్‌ చేసింది. కట్టుకథలతో అసత్యాలు వల్లిస్తోంది. టీడీపీ డైరెక్షన్‌లో నిరాధార కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయతి్నస్తోంది. కానీ వాస్తవాలు చూస్తున్న జనం ఎల్లో మీడియా తీరును బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. 

రాజకీయ ఒత్తిళ్లంటూ విష ప్రచారం  
ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు పని చేయలేక రాజకీయ ఒత్తిళ్లతో సెలవులో వెళ్లి పోతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. డీఎస్పీ, తహసీల్దార్, సెబ్‌ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్‌ కమిషనర్‌లు సెలవులో వెళ్లిపోయరాని తప్పుడు రాతలు రాసింది.  

వాస్తవాలు ఇలా... 
కొన్నిరోజుల క్రితమే డీఎస్పీ రమాకాంత్‌ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఆయన రెండేళ్లకుపైగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిళ్లే ఉంటే రెండేళ్లు ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు.  
►తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం ఇటీవలే విధుల్లోకి వచ్చారు. అయినా ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్యుల సూచన మేరకు..మరో నెల రోజులు సెలవు పెట్టారు.  
►వారం రోజుల క్రితం సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదుల్‌ తన డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైదుల్‌పై కేసు నమోదు కాగా, అతను సెలవుపై వెళ్లారు.  
►తాజాగా బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టారు. ఈ విషయాన్ని కమిషనరే స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. అయినా ఎల్లో మీడియా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కమిషనర్‌ సెలవులో వెళ్తున్నారని విష ప్రచారం చేసింది.  
►ఇలా ఏ కారణంతో అధికారులు సెలవు పెట్టినా ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తూ టీడీపీ, దాని అనుకూల ఎల్లోమీడియా కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  

సెలవునూ రాజకీయం చేస్తారా ?
నేను ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా రెండున్నరేళ్ల నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా. ఏనాడూ రాజకీయ ఒత్తిళ్లు రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయడం బాధ కల్గిస్తోంది. సెలవు ముగియగానే మళ్లీ విధుల్లో చేరుతా. 
–మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్, ధర్మవరం 

వైద్య చికిత్స కోసం సెలవు  
నేను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వైద్యుల సూచనతో విశ్రాంతి కోసం సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మవరంలో రెండేళ్లకుపైగానే విధులు నిర్వర్తించా. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పని చేశాను. మాపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం.  
–నీలకంఠారెడ్డి, తహసీల్దార్, ధర్మవరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top