
వైఎస్సార్‌సీపీ హయాంలో రేటింగ్‌లో ముందున్న ఏపీ డిస్కంలు
ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ 2021–22, 2022–23లోనూ మన డిస్కంలదే హవా
2022 కంటే 2023లో పనితీరు మరింత మెరుగుదల
2023–24 సంవత్సరానికి స్మార్ట్ మీటర్ల ప్రాతిపదికన మూడు నెలల క్రితం రేటింగ్స్ విడుదల
చంద్రబాబు వల్లే చావుదెబ్బ తిని నేటికీ కోలుకోలేకపోతున్న విద్యుత్ సంస్థలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలు.. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు మెరుగైన పనితీరుతో జాతీయ స్థాయిలో అత్యున్నత అవార్డులను సాధించాయి. కానీ.. గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ, ప్రస్తుత పాలనలోనూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరు దారుణంగా దిగజారింది. అయితే.. టీడీపీ కరపత్రం ఈనాడు మాత్రం ఈ విషయాన్ని తారుమారు చేసి జగన్ హయాంలో డిస్కంల పనితీరు బాగోలేదంటూ పచ్చి అబద్ధాలను సోమవారం అచ్చేసింది.
డిస్కంల రేటింగ్ 12వ ఎడిషన్‌లో అగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ లాసెస్ (ఏటీఅండ్‌సీ), బిల్లింగ్ సామర్థ్యం, బకాయిలలో మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించగా.. 2023–24 సంవత్సరానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రాతిపదికన కేంద్రం డిస్కంలకు రేటింగ్ ఇచ్చింది. అది కూడా మూడు నెలల క్రితం అంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. నిజానికి 2023–24 సంవత్సరంలో ఏపీలో ఎక్కడా గృహాలు, వాణిజ్య సరీ్వసులకు స్మార్ట్ మీటర్లను అమర్చలేదు. అందువల్ల ఆ అంశంలో మన డిస్కంలకు రేటింగ్ తగ్గింది. ఆ పాత సమాచారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ పాలనలో డిస్కంలు వెనుకబడిపోయాయంటూ తాజాగా ఈనాడు పత్రిక కథనాన్ని వండివార్చింది.
నిజానికి 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఏ గ్రేడ్‌తో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలిచింది. 13వ ఎడిషన్‌లో కూడా ఈ డిస్కం తన గ్రేడ్‌ను పదిలంగానే ఉంచుకుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) ఆ ఏడాది బీ గ్రేడ్ దక్కించుకున్నాయి. 2021–22 రేటింగ్స్‌తో పోల్చితే ఏపీ డిస్కంలు పనితీరును మరింత మెరుగుపరుచుకుని ఒక గ్రేడ్ పైకి ఎగబాకాయి. ఈపీడీసీఎల్ బీ నుంచి ఏ తెచ్చుకోగా, సీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీ నుంచి బీ గ్రేడ్‌కు చేరుకున్నాయి. కానీ, ఈనాడు మాత్రం ఈ రెండు డిస్కంలు బీ గ్రేడ్‌లో ఉన్నట్టు రాసుకొచి్చంది.
అప్పుడే వెలుగులు
వివిధ వర్గాలకు అందించే ఉచిత, రాయితీ విద్యుత్‌కు సంబంధించి ఏటా రూ.10,361 కోట్లు సబ్సిడీగా నిర్ణయించగా.. గత ప్రభుత్వం రూ.13,852 కోట్లు విడుదల చేసేది. ఈ సబ్సిడీలకు సకాలంలో చెల్లించడంతో పాటు, అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లిస్తూ డిస్కంలు నూటికి 134 శాతం మార్కులు సాధించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దోహదపడింది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నుంచి తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించేందుకు సాయపడేది. బిల్లింగ్ సామర్ధ్యం, రెవెన్యూ కలెక్షన్‌లో 99 శాతం పనితీరుతో డిస్కంలు అద్భుతంగా పనిచేసేవి.
గత ప్రభుత్వ హయాంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందించి ఈ ఘనత సాధించాయి. 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో అవి 5.31 శాతానికి తగ్గాయి. ఇలా జగన్ హయాంలో డిస్కంలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాయి. కానీ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలు వేస్తూ, సకాలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించలేక, విద్యుత్ సరఫరా అందించలేక చతికిలపడుతున్నాయి.