
టీడీపీ నాయకులను అడ్డుకున్న జె. అన్నవరం గ్రామస్తులు
‘తొలి అడుగు’లో చేదు అనుభవం
కాకినాడ జిల్లా: ‘ఏలేశ్వరం నుంచి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించండి. ఆ రోడ్డు పూర్తి చేశాకనే మా ఊరిలోకి రండి. అంతవరకు దయచేయండి’ అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. గ్రామంలో బుధవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిమిత్తం టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. విషయం తెలుసుకున్న యువకులు, గ్రామస్తులు ఎంపీపీని, టీడీపీ నాయకులను అడ్డుకున్నారు.
ఏలేశ్వరం నుంచి తమ గ్రామంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారి అధ్వానంగా మారిందని, ఎన్నికల ముందు రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు నిర్మాణం ఎందుకు చేపట్టలేదంటూ నాయకులను నిలదీశారు. రహదారి నిరి్మంచిన తరువాతే గ్రామంలోకి రావాలని భీష్మించారు. గ్రామస్తులకు సమాధానం చేప్పేందుకు టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఎలాగోలా గ్రామస్తులను శాంతింపజేసి తమ కార్యక్రమం కొనసాగించారు.