సెంటు భూమి ఇవ్వలేదు.. ఇప్పుడు అడ్డుకుంటారా?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిపై మహిళల ఆగ్రహం
సాక్షి, అనపర్తి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే..
► పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి.
►టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు.
►వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంపట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. కాగా, విషయం తెలుసుకుని రామవరం చేరుకున్న రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని విరమించాలని కోరడంతో మహిళలు అందుకు సహకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి