ఆక్సిజన్ అందకే దేవి మృతి చెందిందంటున్న బంధువు
కేజీహెచ్‌లో మహిళ మృతి వివాదాస్పదం
ఆస్పత్రిలో 12 గంటలు విద్యుత్ సరఫరా బంద్
ఇదే సమయంలో మహిళా పేషెంట్ మృతి
ఆక్సిజన్ అందకేనంటూ కుటుంబ సభ్యుల ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పేరు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా వైద్య సేవల కోసం వచ్చే కీలకమైన ఆస్పత్రి. ఇంతటి కీలక ఆస్పత్రి దాదాపు సగం రోజు అంధకారంలో చిక్కుకుంది. ఇదే సమయంలో దేవి అనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందకపోవడం వల్లే మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు.
అయితే మహిళ మృతి చెందింది ఆక్సిజన్ అందక కాదనీ.. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ జరిగి.. గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిళ్లతో ‘పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు’ కేజీహెచ్ అధికారులు ఆల్కహాల్ నాటకానికి తెరతీసారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరస్పర విరుద్ధ ప్రకటనలు
మహిళ మృతిపై కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి పూర్తి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డం గమనార్హం. ‘‘ మధ్యాహ్నం ఉక్కిరిబిక్కిరిగా ఉందని చెప్పింది. ముమ్మాటికీ ఆక్సిజన్ అందకే దేవి మృతిచెందింది’’అని దేవి సోదరి పేర్కొన్నారు. అయితే ‘‘దేవి అనే మహిళ.. 6వ తేదీ తెల్లవారు ఝామున 2.45 గంటలకు జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులతో అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ లెవెల్స్ 93–97శాతం ఉన్నాయి. బీపీ కూడా బాగానే ఉంది. పల్స్ ఎక్కువగా కొట్టుకుంటోంది.
ఆమెని సాధారణ వార్డులోనే చికిత్స అందించారు. ఆమె ఆల్కహాల్‌కు అడిక్ట్ అయినట్లు గుర్తించాం. గురువారం మధ్యాహ్నం లివర్ సామర్థ్యం దెబ్బతినడం, లివర్, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌ఉన్నట్లు అల్ట్రా సౌండ్ రిపోర్టులో గుర్తించాం. రాత్రి సడెన్‌గా గుండెపోటు వచ్చి మృతి చెందింది. ఆమె చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవటం అనేది కారణమే కాదు’’ అని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పేర్కొన్నారు.
అరవద్దంటూ బెదిరింపులు
దేవి ఉదయం చేరినప్పుడే.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నాయని వైద్యులు గుర్తించి.. ఆక్సిజన్ అందించినట్లు బంధువులు చెబుతున్నారు. కానీ.. ఆమె మృతి చెందిన తర్వాత.. కేజీహెచ్ సిబ్బంది మాత్రం.. ‘అబ్బే ఆమెకు అసలు ఆక్సిజన్ పెట్టనేలేదు’అంటూ బుకాయించేస్తున్నారు. ఈ విషయంపై రోగి బంధువులు నిలదీసినప్పుడు.. అరవొద్దంటూ వారిపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఒకే రోజు అన్ని పరీక్షలు చేసేశారా.?
కేజీహెచ్‌కు ఎమర్జెన్సీ కేసు వచి్చనప్పుడు మాత్రమే కీలక పరీక్షలు నిర్వహించి రిపోర్టులను వేగవంతంగా వచ్చే ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ దేవి అడ్మిట్ అయ్యింది.. జ్వరం, వాంతులు, ఒళ్లునొప్పులతోనే. అందుకే.. వైద్యులు సాధారణ వార్డుకి రిఫర్ చేశారు. ఈ పరిస్థితుల్లో పేషెంట్‌కు అ్రల్టాసౌండ్, ఇతర రక్త పరీక్షలు చేసినా.. రిపోర్టులు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయానికి వస్తాయి. కానీ దేవికి మాత్రం వెంటవెంటనే ఎలా వచ్చేశాయి.? ఇవన్నీ మృతి చెందిన తర్వాత సృష్టించినవని బంధువులు విమర్శిస్తున్నారు.


