
కలకలం రేపుతున్న నకిలీ మద్యం లావాదేవీలు
టీడీపీ నేతలు అద్దేపల్లి జనార్దనరావు, పోసాని కోటేశ్వరరావు మధ్య వాట్సాప్ చాటింగ్
రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలు పంపించావేంటని పోసాని ప్రశ్న
వచ్చి కలుస్తానని జనార్దన రావు సమాధానం
కలవడం కాదు.. ఇలాగైతే బావ ఊరుకోడని ఆగ్రహం
మిగిలిన మొత్తం వెంటనే పంపాలని హుకుం
వచ్చే వారం ఇలా చేయొద్దని హెచ్చరిక
తద్వారా ఈ స్కామ్ వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని మరోమారు నిర్ధారణ
సాక్షి నెట్‌వర్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్‌లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ పెద్దలు వెనుక ఉండి.. అద్దేపల్లి జనార్దనరావును ముందు పెట్టి ఈ స్కామ్ నడిపారని ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావుకు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య ఫోన్లో జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇందులో జనార్దనరావు ‘సార్.. ఈ వీక్ ఎమౌంట్ పంపించాను’ అని టెక్ట్స్ చేయగా.. ‘రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలే పంపించావు’ అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు. ‘వచ్చి కలుస్తాను’ అని జనార్దన్ చెప్పగా.. ‘కలవడం కాదు.. బావ ఊరుకోడు.. రిమైనింగ్ అమౌంట్ పంపించు. నెక్ట్స్ వీక్ ఇలా చేయకు’ అని కోటేశ్వరరావు చాట్æ చేసిన వాట్సాప్ మెసేజ్ కలకలం సృష్టిస్తోంది. అద్దేపల్లి జనార్దన్‌రావు ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లను కూటమి నాయకులే పెట్టించారనేందుకు ఇదో ఉదాహరణ అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బాగోతం మొత్తం బట్టబయలు కావడంతో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావును హుటాహుటిన రప్పించి రిమాండ్‌కు పంపడం.. ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించడం.. ఈ స్కామ్‌ను వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ పైకి నెట్టాలని చూడటం తెలిసిందే. అటు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో, ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఈ వ్యవహారంలో టీడీపీ పూర్తిగా ఇరుకున పడిపోవడంతో ‘ముఖ్య’ నేత పలు విధాలా డైవర్షన్ రాజకీయం చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా అధికార టీడీపీ నేతలే చేస్తున్నారని అన్ని ఆధారాలూ ప్రజల్లోకి వెళ్లడంతో ‘ముఖ్య’ నేత అంతర్మథనంలో పడ్డారు. దీన్నుంచి బయట పడేందుకే ‘సిట్’ను ఏర్పాటు చేసి, తాత్కాలికంగా ఈ విషయం మరుగున పడేయాలని యత్నిస్తున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్‌లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్‌లో ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఇంట్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిగాయి.
నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులు జనార్దనరావు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో కూడా కెమెరాలు బిగించారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. మరో వైపు ఏఎన్నార్ బార్ సమీపంలో పట్టుబడిన నకిలీ మద్యం డంప్‌కు అనుకుని ఉన్న స్వర్ణ సినీ కాంప్లెక్స్‌లోని సీసీ టీవీ పుటేజీని ఎక్సైజ్ శాఖ ఎన్‌పోర్స్‌మెంట్ సీఐ వర్మ పరిశీలించారు.