ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్‌.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Weather Updates: Heavy Rains In Ap For Two Days - Sakshi

సాక్షి, అమరావతి: ఐఎండి అంచనా ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా  ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి నుంచి తేలికపాటి  నుంచి  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

రేపు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పారు.

ప్రస్తుత వాతావరణ అంచనా బట్టి ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలు  నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి  శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం, దాదాపు 41 ప్రాంతాల్లో 60 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు.
చదవండి: భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో  గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నట్లు విపత్తుల సంస్థ పేర్కొంది. బుధవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద మొదటి  ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని నీటిమట్టం 46.70 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  8.26  లక్షల క్యూసెక్కులు ఉందని రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. 

పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కారణంగా మూడు,నాలుగు రోజులు గోదావరి వరద పెరిగే అవకాశం ఉందన్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ  సంబంధిత జిల్లాల యంత్రాంగానికి, మండల, గ్రామ స్థాయి అధికారుల వరకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 6 బృందాలు బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు.

క్షేత్రస్థాయిలో ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు  1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top