సాక్షి, విజయవాడ: వరుస సెలవులు, ఆదివారం నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు.
భక్తుల రద్దీని నియంత్రించడంతోపాటు సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కనకదుర్గనగర్ వైపు వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు పేర్కొన్నారు. కొండపైకి వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని కోరారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను వినియోగించనున్నట్లు ఈవో తెలిపారు. అయితే, లిఫ్ట్ మార్గాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. భక్తులు మహా మండపం ర్యాంప్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లులు అధిక రద్దీ కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉదయం 8 గంటలలోపు లేదా సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్య దర్శనానికి రావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులు అధికారుల సూచనలను పాటిస్తూ దర్శన ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.


