సచివాలయాల ద్వారా 3.64 కోట్ల సేవలు

లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదే
మంత్రి విడదల రజిని
యడ్లపాడు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తమ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు 3.64 కోట్ల సేవలను అందించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఇది మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఉపాధిహామీ పథకం కింద రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.
ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలను నిర్మించారని, ఇది దేశ చరిత్రలోనే మహాయజ్ఞమని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం 1.34 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వీరిలో 85 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమన్నారు.
ప్రతి సచివాలయం ద్వారా 540 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామన్నారు. 50 కుటుంబాలకు ఒక వలంటీర్ వంతున లక్షలమందిని నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఒక్క వంకాయలపాడు సచివాలయం పరిధిలోనే నాలుగువేలకుపైగా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించినట్లు చెప్పారు. టీడీపీ హయాంలో అంతా దుర్మార్గమేనని చెప్పారు. అప్పట్లో జన్మభూమి కమిటీలకు నచ్చిన, వారి పార్టీకి చెందిన, లంచం ఇచ్చిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేవన్నారు.
మరిన్ని వార్తలు :