రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది తర్వాత ప్రకటిస్తా
ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా
వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ చెప్పారు. ఆదివారం పాలకొల్లులో కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పయనమైన ఆమె.. తొలుత విజయవాడలోని తమ ఇంటి ఎదుట వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు నుంచే ప్రజా జీవితం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ‘ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా ఉంటా’ అని స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నానని, రాధా రంగా మిత్ర మండలితో కొంత గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.
ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు తాను ప్రజా జీవితంలోకి వస్తున్నానని తెలిపారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని, ఇద్దరిదీ రంగా ఆశయ సాధనే లక్ష్యమన్నారు. ఇకపై రాధా రంగా మిత్ర మండలి, రంగా ఫ్యాన్స్‌తో కలుస్తానని, అన్ని అంశాలు చర్చిస్తానన్నారు. పబ్లిక్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. రాజకీయ ఆరంగేట్రంపై తర్వాత స్పందిస్తానని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల కోసం రాలేదని, సందర్భం వచ్చినప్పుడు అందరి సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం ఆమె రాధా రంగా మిత్ర మండలితో కలిసి కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పాలకొల్లు బయలుదేరి వెళ్లారు.


