USAID Mission Director Veena Reddy Special Interview With Sakshi News - Sakshi
Sakshi News home page

USAID Mission Director Veena Reddy: కోవిడ్‌ సాయం.. ఐదు కోట్ల మందికి

Published Thu, Sep 23 2021 8:56 AM

USAID Mission Director Veena Reddy Special Interview With Sakshi News

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేసిన సాయం భారత్‌లో సుమారు ఐదుకోట్ల మందికి చేరిందని యూఎస్‌ ఎయిడ్‌ (యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌) మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో భారత్‌కు సాయం అందించిన కొద్దిసంస్థల్లో యూఎస్‌ ఎయిడ్‌ కూడా ఒకటి అని చెప్పారు. కరోనా  తొలినాళ్ల నుంచి ఇప్పటివరకూ దాదాపు 22 కోట్ల డాలర్ల విలువ (సుమారు రూ.1,600 కోట్లు) చేసే సాయం అందివ్వగలిగామన్నారు.

రాయలసీమలో పుట్టి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లిన వీణారెడ్డి న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం యూఎస్‌ ఎయిడ్‌ భారత విభాగానికి మిషన్‌ డైరెక్టర్‌ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవి చేపట్టిన తరువాత తొలిసారి భారత్‌కు విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. 
(చదవండి: Veena Reddy: ఏపీ అభివృద్ధి సంతృప్తినిస్తోంది)

ప్ర: యూఎస్‌ ఎయిడ్‌ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన మీకు శుభాకాంక్షలు. మీరు పుట్టిన భారత్‌లో దాని ప్రణాళికలెలా ఉండబోతున్నాయి? 
జ: యూఎస్‌ ఎయిడ్‌ భారత్‌తో పాటు దాదాపు వంద దేశాల్లో పనిచేస్తోంది. యూఎస్‌ ఎయిడ్‌ ఏర్పాటై 60 ఏళ్లు అవుతుంటే.. భారత్‌కు అమెరికా సాయం అన్నది పదేళ్ల ముందే మొదలైంది. ఆరోగ్యం, కాలుష్య రహిత విద్యుదుత్పత్తి, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, అటవీ పరిరక్షణ వంటి అంశాల్లో యూఎస్‌ ఎయిడ్‌ భారత్‌లో పలు కార్యక్రమాలను చేపట్టింది. సమస్యల పరిష్కారానికి, సుస్థిరాభివృద్ధికి తగిన తోడ్పాటు అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సైతం స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రైవేట్‌ సంస్థలతో కలిసి స్థానిక అభివృద్ధి విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం.

 

ప్ర: తెలంగాణ, ఏపీల్లో ఏ రకమైనప్రాజెక్టులు చేపట్టింది? 
జ: చాలా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ అటవీ శాఖ యూఎస్‌ ఎయిడ్‌ అభివృద్ధి చేసిన కొన్ని సాంకేతిక మెళకువలు, మొబైల్‌ అప్లికేషన్లను అటవీ నిర్వహణ కోసం ఉపయోగిస్తోంది. వీటి వాడకం కారణంగా అటవీ నిర్వహణ ప్రణాళికలు తయారు చేయడం సులువు కావడమే కాకుండా స్థానికుల జీవనోపాధి అవకాశాలూ పెరిగాయి. ‘వన్‌’ పేరుతో యూఎస్‌ ఎయిడ్‌ తయారు చేసిన మొబైల్‌ అప్లికేషన్‌ను మొదట మెదక్‌ అటవీ విభాగంలో ఉపయోగించారు. ఇప్పుడు తెలంగాణలోని దాదాపు 31 అటవీ విభాగాలకు విస్తరించారు కూడా.

ఇది మచ్చుకు ఒక్క కార్యక్రమం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. గురువారం (సెప్టెంబర్‌ 23వ తేదీ) వైజాగ్‌లో ‘‘వాటర్‌ ఫ్రమ్‌ ఎయిర్‌’’ కేంద్రాన్ని సందర్శించనున్నాం. గాల్లోని తేమను నీరుగా మార్చే ఈ కేందాన్ని అవసరమైన చోటికి తరలించ వచ్చు కూడా. ఇలాంటి కొత్త టెక్నాలజీ కారణంగా నగర ప్రాంతాల్లోని పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.   

ప్ర: కోవిడ్‌కు సంబంధించి భారత్‌కు ఎలాంటి సాయం అందింది? 
జ: కరోనా మొదలైనప్పటి నుంచి అనేక రకాలుగా సాయం అందించాం. పీపీఈ కిట్లు మొదలుకొని ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు వరకూ దాదాపు ఏడు విమానాల్లో తరలించాం. కరోనా రెండో దశను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో యూఎస్‌ ఎయిడ్, అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు తమవంతు సాయం అందించాయి. ఒక అంచనా ప్రకారం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు యూఎస్‌ ఎయిడ్‌ అందించిన వేర్వేరు రకాల సాయం వల్ల ఐదు కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారు.

ఇక కోవిడ్‌ కారణంగా జీవనోపాధులు నష్టపోయిన వారికి, చిరు వ్యాపారులకు, మహిళలకూ సాయం అందించాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కోవిడ్‌ తొలి, రెండో దశల్లో యూఎస్‌ ఎయిడ్‌ మంగళగిరి (ఏపీ), బీబీనగర్‌ (తెలంగాణ)లోని ఎయిమ్స్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు, వెంటిలేటర్లను సరఫరా చేసింది. దాంతోపాటు ఆరోగ్య సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇప్పించాము. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో విజయవాడలో ఏర్పాటు కానున్న సీసీఎంబీ శాటిలైట్‌ సెంటర్‌కు యూఎస్‌ ఎయిడ్‌ సాంకేతిక పరిజ్ఞాన పరమైన సాయం అందిస్తోంది. 

ప్ర: ‘వాతావరణ మార్పులు’ అంశంలో ఎలాంటి పాత్ర పోషించనుంది? 
జ: వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు తరచూ చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువ గా గురయ్యే వర్గాలకు యూఎస్‌ ఎయిడ్‌ సాయం అందించే ప్రయత్నం చేస్తోంది. కాలుష్య రహిత విద్యుదుత్పత్తి రంగానికి ప్రోత్సాహం అందించడం కూడా ఇందులో ఒకటి. భారత ప్రభుత్వంతో కలసి సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు మరిన్ని ఏర్పాటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. తద్వారా కాలుష్య కారకమైన బొగ్గుపై ఆధారపడటం కొంతైనా తగ్గుతుంది. వాతవరణంలోకి చేరిన కార్బన్‌ డయాక్సైడ్‌ను శోషించుకునేందుకు అవసరమైన అటవీ సంపద పెరుగుదలకూ సహకరిస్తున్నాం.  
(చదవండి: అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి)

రాయలసీమలో పుట్టి .. యూఎస్‌లో ఎదిగారు 
వీణారెడ్డి తల్లి వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారైతే.. తండ్రి కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన వారు. చికాగో యూనివర్సిటీలో బీఏ, ఎంఏ విద్యనభ్యసించిన వీణారెడ్డి కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి  డాక్టర్‌ ఆఫ్‌ జ్యూరిస్‌ ప్రూడెన్స్‌ పట్టా పొందారు. న్యాయవాదిగా రాణించిన ఈమె ఆ తరువాతి కాలంలో యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా పలు దేశాల్లో సేవలందించారు. మూడేళ్ల వయసులోనే అమెరికా వెళ్లినప్పటికీ తల్లి తనను తరచూ భారత్‌కు తీసుకువచ్చేదని, హైదరాబాద్‌తో పాటు కోయిలకుంట్లలోనూ బోలెడంత మంది బంధువులు ఉన్నారని వీణారెడ్డి చెప్పారు. తన తాత అంకిరెడ్డి జర్నలిస్టు మాత్రమే కాకుండా.. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement