ఆలయాల జీర్ణోద్ధరణకు.. టీటీడీ నుంచి ఏటా రూ. 50 కోట్లు

Ttd May Spend 50 Crore Yearly For Old Temple Renovation - Sakshi

ఇప్పటివరకు ఏటా రూ.2.25 కోట్లు మాత్రమే ఇస్తున్న టీటీడీ

ఆ మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతూ ఇటీవలే కేబినెట్‌లో తీర్మానం

ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ధార్మిక పరిషత్‌ అధికారాలపై మరో ఆర్డినెన్స్‌ జారీ

సాక్షి, అమరావతి : పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ఆదాయంలేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇకపై ఏటా రూ.50 కోట్లను దేవదాయ శాఖకు సమకూర్చనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ప్రతి ఐదేళ్లకోసారి పది శాతం చొప్పున పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవు. దేవదాయ శాఖ నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలకే వీటిని ఖర్చుచేస్తారు.

ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలకుగాను టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను అందజేస్తోంది. అయితే, ఈ కార్యక్రమాలకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం దేవస్థానాలు ఒక్కొక్కటీ రూ.10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019–20లో శ్రీశైలం ఆలయం ఒక్కటే రూ.32 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఏటా చెల్లించే మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతూ దేవదాయ శాఖ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆగస్టులో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చట్ట సవరణ జరిగే వరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ విడుదల చేసింది.  

సర్వశ్రేయో నిధికే ఏటా రూ.40 కోట్లు
కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం.. దేవదాయ శాఖ పరిధిలో ఉండే సర్వశ్రేయో నిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌–సీజీఎఫ్‌)కి టీటీడీ ప్రస్తుతం ఏటా రూ.1.25 కోట్లు అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ.40 కోట్లకు పెంచుతూ కూడా చట్ట సవరణ చేశారు. పాడుబడ్డ ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూపదీప నైవేద్య స్కీం (డీడీఎన్‌ఎస్‌) వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే.. 

  • అర్చకులు, ఇతర ఉద్యగుల సంక్షేమ నిధికి టీటీడీ ఇప్పటిదాకా ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. 
  • అంతేకాక.. దేవదాయ శాఖ పరిపాలన నిధికి టీటీడీ ఇప్పటివరకు ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని కూడా రూ.5 కోట్లకు పెంచి చట్ట సవరణ చేశారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top