శ్రీవారి వద్ద సేవే చేయాలి.. ఉద్యోగం కాదు | Chandrababu TTD Job Policy Sparks Debate, Service, Not Employment Remarks Draw Employee Anger, Check Details | Sakshi
Sakshi News home page

శ్రీవారి వద్ద సేవే చేయాలి.. ఉద్యోగం కాదు

Sep 17 2026 8:14 AM | Updated on Sep 17 2026 9:15 AM

TTD Employees Angry Over Chandrababu Comments On Jobs In Tirumala

అవసరమైన మేరకే ఉద్యోగాలు  

కొత్త కొలువులిస్తే టీటీడీ ఆదాయం 100 శాతం జీతాలకే 

వైద్య, విద్య రంగంలోని ఉద్యోగులు కూడా శ్రీవారి సేవకులుగా మారాలి 

శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూముల వివరాలు  ఆన్‌లైన్‌లో.. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు   

తిరుమల : శ్రీవారి వద్ద సేవ చేయాలే తప్ప ఉద్యోగాలు కల్పించే సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మారకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అంతవరకే ఇస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే టీటీడీ ఆదాయంలో 100 శాతం జీతాలకే వెళ్లిపోతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. వైద్య, విద్యారంగాల్లో పనిచేసే వారిని కూడా సేవకులుగా మార్చి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.      

తిరుపతికి స్కైవాక్‌.. 50 ఎకరాల్లో పార్కింగ్‌.. 
తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు ఆ ప్రాంతాన్ని అనుసంధానించేలా స్కైవాక్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల తిరుపతిలో సేకరించిన 50 ఎకరాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్‌ ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిని వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా మార్చాలన్నది తమ ఆలోచన అని ∙తెలిపారు.

రూ.3,165 కోట్ల అన్నదానం కార్పస్‌ ఫండ్‌.. 
టీటీడీలోని ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు దాదాపు రూ.3,165 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉందని సీఎం వెల్లడించారు. ప్రాణదానం ట్రస్ట్‌ ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. 

65 ఆలయాలకు ఏ, బీ, సీ కేటగిరీలు.. 
టీటీడీ ఆధ్వర్యంలోని 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలకు నీటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.  మీడియా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వేంకటేశ్వర్, అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.   

తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు.. 
ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్‌ అండ్‌ డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, దుర్లభ దర్శన్‌ వీఆర్‌ అనుభవం, ఎలక్ట్రిక్‌ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకం ఉన్నాయి.

సీఎం వ్యాఖ్యలపై టీటీడీ సిబ్బంది ఫైర్‌!
సాక్షి టాస్‌్కఫోర్స్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల నియామకాలపై సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు ఉండవు.. అవసరం మేరకే ఉంటాయి.. శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వచ్చే ఆదాయం వంద శాతం ఉద్యోగుల జీతాలకే వెళ్తుంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. ఉద్యోగాల విషయంలో ఇలా మాట్లాడటాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.  

ఉద్యోగానికి బదులు ‘సేవ’?.. 
రాష్ట్రంలో ప్రభుత్వంతో సమాంతరంగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది. టీటీడీలో శాశ్వత, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కింద సుమారు 15 వేల నుంచి 16 వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం. టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి వివిధ రూపాల్లో జీవనోపాధి లభిస్తుంది. అటువంటి ధార్మిక సంస్థలో ఉద్యోగావకాశాలకు గండికొట్టేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఇటు టీటీడీలోనూ.. అటు జనంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం, విద్య తదితర రంగాల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీచేయడం కంటే ఇప్పటికే ఉన్న శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమాల్లో వినియోగించుకోవాలన్న దిశగా సీఎం వ్యాఖ్యలు ఉండడంపై టీటీడీ ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement