9 నెలల పసికందు సహా ముగ్గురు మృతి
భర్త కొట్టడంతో దారుణానికి ఒడిగట్టిన గృహిణి
నంద్యాలలో విషాదం
నంద్యాల: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. తల్లి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాలలో కలకలం రేపింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని లలితానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్, ఎస్‌బీఐ కాలనీకి చెందిన మల్లికకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్‌కిరణ్ పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తుండగా మల్లిక (27) గృహిణి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్లికను భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె కుడిచేతిపై గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లిక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడేందుకు నిర్ణయించుకుంది.
ఇంట్లో ఉన్న పురుగు మందును ఇద్దరు పిల్లలకు తాగించి.. తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన మృతురాలి బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి మల్లికను, పిల్లలు ఇషాంత్ (3), పరిణతి(9 నెలలు)ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తించడంతో పాటు ఇంట్లో ఉన్న రెండు పురుగు మందు డబ్బాలను సీజ్ చేశారు. భర్త ఉదయ్‌కిరణ్ పరారీలో ఉన్నాడు. మృతురాలి తమ్ముడు కార్తీక్ ఫిర్యాదు మేరకు భర్త ఉదయ్, ఆడపడుచు, తోటికోడళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


