తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో టిటిడి చేపట్టిన విద్యుత్ అంలకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుచానూరు పరిసర ప్రాంతాలలో, తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. బ్రహ్మోత్సవాల రాత్రుల సమయాలలో పండుగ వాతావరణాన్ని మరిపిస్తున్నాయి.
శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న, పెద్ద, మధ్య తరహా అమ్మవారి, స్వామి ప్రతిమలు దాదాపు 112కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు. ఈ సారి కొత్తగా తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు, ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మీ 3 డి విద్యుత్ ప్రతిమలను, పుష్కరిణి దక్షిణం వైపున గజ వాహనం, పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం, ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మీ, తలుపుల మహా విష్ణు రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పుష్కరిణి చుట్టూ 8 అష్ట లక్ష్మీ విద్యుత్ విగ్రహాలు, అన్నదానం సమీపంలో ధన లక్ష్మీ, పూడి సమీపంలో రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ వద్ద గడప లక్ష్మీ, అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలలో మహా విష్ణు, గరుడ వాహనంపై స్వామి వారు, అమ్మవారు, కలశ లక్ష్మీ, విష్ణువు, లక్ష్మీ, అయోథ్య రాముడు, అష్ట లక్ష్మీలతో మహా విష్ణువు, విశ్వరూపం, అష్ట లక్ష్మీలు, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, దశ విగ్రహాలు, ఎల్.ఈ.డి తోరణాలు, ఎల్.ఈ.డితో డిజైన్ చేసిన ఆర్చ్ లను ఏర్పాటు చేశారు. పద్మ సరోవరం లోపలి భాగంలో నాలుగు వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్ కాంతులు అదనపు ఆకర్షణ.

తిరుచానూరు పరిసరాలు రాత్రుల సమయాలలో రజతంలా మెరిసిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తూ, భక్తుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి. తిరుచానూరు అంతటా విద్యుత్ కాంతుల వెలుగులు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.


