ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు | There are two categories of promotions in RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు

Nov 4 2023 4:55 AM | Updated on Nov 4 2023 2:36 PM

There are two categories of promotions in RTC - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం(ఆర్టీసీ) ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు అంటే.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్‌ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయించింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్‌ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్‌ ఇచ్చింది. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. దీనిపై త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని నిర్ణయించింది.  

రెండు కేటగిరీలుగా పదోన్నతులు
2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు.

దీంతో గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.

దాంతో 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement