
వలస పక్షుల కోసం గగనతలాన అద్భుత దారులు
సాక్షి, అమరావతి: గగనతలాన ఎగిరే పక్షులు సుదూర ప్రాంతాలకు వలస పోతుంటాయి. ఇవి వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఓ అద్భుతం. అత్యంత కఠిన వాతావరణాల్లోనూ లెక్కలేనన్ని ముప్పులను తప్పించుకుంటూ ఇవి దేశాలు, ఖండాలను ఎలా దాటతాయో అందరికీ ఆశ్చర్యకరమే.. అయితే విమానాలు, వాహనాల పయనానికి నిర్దిష్ట మార్గాలున్నట్టే పక్షులకు వలస దారులు ఉంటాయని మీకు తెలుసా? అవును వాటికీ కచ్చితమైన దారులు ఉంటాయి. వాటిని ఫ్లైవేస్ అంటారు. ఆహారం, ఆశ్రయం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షులు ఈ మార్గాలను నిర్దేశించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వలస పక్షులకు సంబంధించి మూడు సూపర్ ఫ్లైవేస్ ఉన్నాయి.

అవి ఏమిటీ? వాటి ప్రత్యేకతలేంటంటే..
1.ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవే
పక్షుల వలసకు ఉన్న ప్రధాన మార్గాల్లో ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవే ఒకటి. ప్రపంచంలోనే గొప్ప ఫ్లైవేగా దీన్ని అభివర్ణిస్తారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల్లోని 50కిపైగా దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. ఆర్కిటిక్ నుంచి దక్షిణాఫ్రికా వరకు మూడు ప్రధాన మార్గాలు ఈ ఫ్లైవేకు అనుసంధానమై ఉంటాయి. గగనతలాన అత్యంత కఠిన పరిస్థితుల మధ్య లక్షల సంఖ్యలోని పక్షులు ఈ ఫ్లైవేలో ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షుల్లో పది శాతం అంతరించిపోయే దశలో ఉన్నాయి.
2.తూర్పు ఆసియా–ఆస్ట్రేలియన్ ఫ్లైవే..
ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో పక్షులు తిరిగే దారి ఇది. అలాస్కా నుంచి ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 37 దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. 600 పక్షి జాతులు ఈ దారిన ప్రయాణిస్తాయి.
3.సెంట్రల్ ఆసియా ఫ్లైవే..
ప్రపంచంలోనే అతిచిన్న ఫ్లైవే ఇది. అయినప్పటికీ ఈ మార్గాన్ని 600 కంటే ఎక్కువ వలస పక్షి జాతులు ఉపయోగిస్తున్నాయి. ఇది ఉత్తరాన శీతల సైబీరియా నుంచి ఉష్ణమండల మాల్దీవుల వరకు 30 దేశాల మీదుగా సాగుతుంది. ఈ ఫ్లైవేలో వెళ్ళే కొన్ని పక్షులు తమ జీవితకాలంలో అనేకసార్లు హిమాలయాలను దాటతాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షి జాతుల్లో 48 శాతం ముప్పును ఎదుర్కొంటున్నాయి. బార్–హెడ్ గూస్ తన జీవితకాలంలో పలుమార్లు హిమాలయాలను (ఎవరెస్ట్ శిఖరంపై సహా) దాటతాయి. రోసీ స్టార్లింగ్స్, అమూర్ ఫాల్కన్స్, ఫ్లెమింగో వంటి పక్షులు సెంట్రల్ ఆసియా ఫ్లైవే ద్వారా శీతాకాలంలో భారతదేశానికి వస్తాయి. ఈ మార్గంలో ఎక్కువగా చిత్తడి నేలలు, సరస్సులు, అడవులు ఉండడంతో వాటికి స్టాప్‌ఓవర్ పాయింట్ల ఉన్నాయి. అక్కడ ఆగి ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవడం చేస్తాయి.
4.అమెరికాస్ ఫ్లైవే..
ప్రపంచంలో ఎక్కువ పక్షి జాతులు తిరిగే ఫ్లైవే ఇది. 2 వేల కంటె ఎక్కువ విభిన్న పక్షి జాతులు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. దక్షిణ అర్జెంటీనాలోని టియెర్రా డెల్ ఫ్యూగో నుంచి ఉత్తరాన ఆర్కిటిక్ సర్కిల్ వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైవేలో 35 దేశాలను దాటే మూడు వలస మార్గాలు ఉన్నాయి. ఈ రూటులో 3 అంగుళాల పొడవు ఉంటే రూఫస్ హమ్మింగ్‌బర్డ్ 3 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
విహంగాలు ఎగిరే మార్గాల్లో ఇంకొన్ని
1. ఆసియన్–ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే: దక్షిణ ఆసియా (ముఖ్యంగా భారత ఉపఖండం) నుంచి తూర్పు ఆఫ్రికా
2. వెస్ట్ పసిఫిక్ ఫ్లైవే : ఉత్తర ఆసియా (సైబీరియా, జపాన్) నుంచి దక్షిణ పసిఫిక్ ద్వీపాలు, ఆస్ట్రేలియా
3. పసిఫిక్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (అలాస్కా, కెనడా) నుంచి దక్షిణ అమెరికా (చిలీ, అర్జెంటీనా) పసిఫిక్ తీరం వెంబడి ఉంది
4. సెంట్రల్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (కెనడా, యుఎస్) నుంచి సెంట్రల్ అమెరికా,ఉత్తర దక్షిణ అమెరికా
5.అట్లాంటిక్ అమెరికాస్ ఫ్లైవే : తూర్పు ఉత్తర అమెరికా నుంచి కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా యొక్క అట్లాంటిక్ తీరం వరకు ఉంటుంది
6. మిస్సిసిపి అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా మధ్య భాగం (మిస్సిసిపి నది లోయ) నుంచి సెంట్రల్, దక్షిణ అమెరికా వరకు మార్గాలున్నాయి.
సహజసిద్ధ శక్తిసామర్థ్యాలు
⇒ పక్షులు భూమ్మీదున్న అయస్కాంత క్షేత్రాలను గుర్తించడానికి తమ మెదడులోని ప్రత్యేక కణాలను ఉపయోగిస్తాయి. ఇవి వాటికి ఒక సహజ దిక్సూచిలా పనిచేస్తాయి. పగటి వేళల్లో సూర్యుడి స్థానం ఆధారంగా తమ దిశను నిర్ణయించుకుంటాయి. సూర్యుడి కదలికలను అనుసరిస్తూ మార్గాన్ని నిర్దేశించుకుంటాయి. రాత్రి సమయాల్లో నక్షత్రాల స్థానాలను బట్టి దిశను గుర్తిస్తాయి.
⇒ పర్వతాలు, నదులు, తీరప్రాంతాలు వంటి భౌగోళిక లక్షణాలను పక్షులు గుర్తుపెట్టుకుని వాటి ఆధారంగా మార్గాన్ని నిర్ధారించుకుంటాయి. కొన్ని పక్షులు గాలి దిశ, ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులను అనుసరించి ఎగురుతాయి. రోసీ స్టార్లింగ్స్ అనే పక్షిజాతి వాతావరణ సూచనలను ఆధారంగా తమ ప్రయాణ సమయాన్ని నిర్ణయించుకుంటుంది.
⇒ బార్–హెడెడ్ గూస్ పక్షి జాతి హిమాలయాలను దాటేటప్పుడు 8 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ. వాటి శరీరం అంత తీవ్రమైన పరిస్థితులనూ తట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.
⇒ పక్షులు ప్రయాణ మార్గాలను జన్యుపరంగా లేదా అనుభవం ద్వారా గుర్తుంచుకుంటాయి. అమూర్ ఫాల్కన్స్ పక్షి జాతి సైబీరియా నుంచి ఆఫ్రికాకు 22 వేల నుంచి 30 వేల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి కచ్చితమైన గమ్యస్థానాలకు చేరుకుంటాయి.
⇒ ఆవాసాలు చెదిరిపోవడం, వాతావరణ మార్పులు, కాంతి కాలుష్యం, గాలి టర్బైన్లు, ఎత్తైన భవనాల వల్ల విహంగాలు అప్పుడప్పుడు గందరగోళానికి గురవుతాయి.