కలెక్టర్‌ వీపు బద్దలు కొడతాం! | Tension at the police station due to the TDP leaders | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వీపు బద్దలు కొడతాం!

Apr 5 2025 5:30 AM | Updated on Apr 5 2025 11:06 AM

Tension at the police station due to the TDP leaders

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టీడీపీ మండలాధ్యక్షుడి బరితెగింపు 

పోలీసులకూ హెచ్చరిక.. రెండువేల మందితో వస్తాం.. 

లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపు 

ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో లాటరీ తీయడంపై ‘వాడెవడు’ అంటూ ఆర్డీఓపై పరుష పదజాలం 

టీడీపీ నేతల దౌర్జన్యకాండతో పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత  

సంతబొమ్మాళి  : రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు అంతులేకుండాపోతోంది. అధికారం ఉండగానే వీలైనంత మేర దండుకునేందుకు చెలరేగిపోతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయడంలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బెంబేలెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి  మండలంలో చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీరు బీమారావు అధికారం అండతో పేట్రేగిపోయారు. కలెక్టర్, ఆర్డీఓపై పరుష వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ వీపులు బద్దలు కొడతామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.

సాక్షాత్తు పోలీసుస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వివరాలివీ.. మండలంలోని మూలపేట గ్రామంలో చేపల కట్టు వేలం పాట, ఇతర విషయాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వారు నౌపడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడ టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఊరికి, తమకు సంబంధంలేదని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ జీరు బాబూరావు అంటున్నారని రేపు ఏం జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దని భీమారావు పోలీసులను హెచ్చరించారు. 

సర్పంచ్‌ బాబూరావు లెక్కలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో.. మూలపేట పోర్టు నిర్మాణం నిమిత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రస్తావన వచ్చింది. దీంతో.. సర్పంచ్‌ ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నాడని, పోర్టు నిర్మాణ నిమిత్తం మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి కలెక్టర్‌ వస్తే ఆయన వీపు బద్దలుకొడతామని పోలీసుల సమక్షంలో భీమారావు పరుషంగా మాట్లాడారు. ‘మేం మా­రం.. మా ఊరు వదలం.. పరిహారం డబ్బు­లు ఎవరికి ఇచ్చారని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు’ అంటూ రెచ్చిపోయారు.

పోర్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో 580 కుటుంబాలకు లాటరీ తీయకుండా.. ‘వాడెవడు 80 మందికి లాటరీ తీశాడం’టూ ఆర్డీఓపై విరుచుకుపడ్డారు. ‘గ్రామాన్ని ఖాళీ చేయడమేమిటి? అంతా మీ ఇష్టమా? ఇళ్లు, డబ్బులు ఎవరికిచ్చారం’టూ ప్రశ్నించారు. ‘పోలీస్‌స్టేషన్‌కు ఈరోజు 200 మంది వచ్చాం.. రేపు రెండువేల మందితో వస్తాం.. లెక్కలు చెప్పకపోతే చంపేస్తాం.. మీరు మాత్రం కేసు కట్టకండి’ అని పోలీసులను భీమారావు హెచ్చరించారు. ఇలా టీడీపీ నేతల తీరుతో మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు.. సర్పంచ్‌ బాబూ­రావు శనివారం లెక్కలు చెప్తారని పోలీసులు నచ్చజెప్పడంతో అంతా అక్కడి నుంచి  నిష్క్రమించారు.

Advertisement
 
Advertisement
Advertisement