
అస్మదీయులకు దోచిపెట్టడానికే సింగిల్ బిడ్ నిబంధన
పీపీపీలో నాలుగు మెడికల్ కాలేజీల నిర్వహణకు టెండర్లు ఆహ్వానం
టెండర్లలో ఒక్కరొచ్చినా ఆమోదించేలా నిబంధన
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు.. జీఓ–94కు విరుద్ధంగా మార్గదర్శకాలు
కాలేజీలు ఎవరికి కట్టబెట్టాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు.. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దుచేయాల్సిందే.. పులివెందుల, ఆదోని మార్కాపురం, మదనపల్లె కాలేజీలు ప్రైవేట్‌కు ధారాదత్తం
సాక్షి, అమరావతి: గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని తమ బినామీలు, అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు లైన్‌క్లియర్ చేసుకుంటున్నారు. రూ.వేల కోట్లు విలువ చేసే ఈ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో తామనుకున్న వ్యక్తులకే దోచిపెట్టేలా వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగా.. ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) గురువారం ఆహ్వానించిన టెండర్లలో తమకు అనుకూలంగా ఉండేలా అడ్డగోలుగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించుకున్నారు.
తాము అనుకున్న వ్యక్తుల నుంచి సింగిల్ బిడ్ దాఖలైనా సరే వారికే కట్టబెట్టేసేలా నిర్ణయం తీసుకుని ముందుగా పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఈ నాలుగింటికీ వేర్వేరుగా టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ ముగిసి, ఎంపికైన సంస్థలతో ఒప్పందం చేసుకున్న రోజు నుంచి 66 ఏళ్ల పాటు కళాశాలలపై హక్కులు కల్పిస్తామని అందులో పేర్కొన్నారు.
ఎవరికివ్వాలో ముందే ఫిక్స్..
గద్దెనెక్కిన నాటి నుంచి కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ పెద్దలు అవినీతికి తెరలేపారు. టెండరు ప్రక్రియలో పారదర్శకతకు పూర్తిగా పాతరేశారు. టెండరు ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు, ప్రజాధనం ఆదా చేసేందుకు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు మంగళం పాడేసి కాంట్రాక్టులన్నీ తామనుకున్న వ్యక్తులకే ఏకపక్షంగా కట్టబెడుతూ వస్తున్నారు.
కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై ముందే ఫిక్స్ అయిపోయి, వారికే టెండర్లు దక్కేలా మార్గదర్శకాలు రూపొందించడం.. ఆ ఒక్కరే బిడ్ వేసినా ఆమోదించే వెసులుబాటు కల్పించుకుని రెచ్చిపోతున్నారు. ఇదే కుట్రను ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ టెండర్లలోనూ అమలుచేస్తూ బరితెగిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన కళాశాలలను అస్మదీయులు, బినామీల ద్వారా కొట్టేసి, వైద్య విద్యా వ్యాపారం, బోధనాస్పత్రుల్లో చికిత్సల రూపంలో దోచుకునేందుకు పన్నాగం పన్నారు.
అయితే, ఈ టెండర్లలో పేర్కొన్న నిబంధనలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు (సీవీసీ), జీఓ–94కు విరుద్ధం. నిజానికి.. సింగిల్ బిడ్ దాఖలైన సమయంలో టెండరును రద్దుచేసి, మళ్లీ పిలవాలని 2003లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వం జీఓ–94 ఇచ్చింది. సింగిల్ బిడ్ దాఖలైన సందర్భాల్లో టెండర్లు రద్దుచేయాలని సీవీసీ కూడా సూచిస్తోంది.
ఏడాదికి ఎకరం భూమి రూ.100కే..
అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుచేపట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కాలేజీలు 2023–24లో.. పాడేరు వైద్య కళాశాలలో తరగతులు గతేడాది ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మిగిలిన 10 కళాశాలలను టీడీపీ కూటమి ప్రభుత్వం ‘ప్రైవేట్’కు అప్పగిస్తోంది.
తొలిదశలో.. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కళాశాలలను పీపీపీకి ఇస్తోంది. ఈ కళాశాలలను దక్కించుకునే సంస్థలు ఎకరానికి రూ.100 లీజు చెల్లిస్తే చాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో వైద్య కళాశాల 50 నుంచి దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం కారుచౌకగా కట్టబెడుతోంది.
మరోవైపు.. 70 శాతం ఐపీ పడకల్లో చికిత్సలకు ఆరోగ్యశ్రీ, పీఏంజేఏవై కింద బిల్లులు చెల్లిస్తామని.. మిగిలిన 30 శాతం పడకలకు ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగానే దోచుకునేందుకు ఆస్కారం కల్పిస్తోంది. ఇక రక్త, ఇతర వైద్య పరీక్షల రూపంలోనూ జనాల రక్తాన్ని జలగల్లా పీల్చేయడానికి హక్కులూ కల్పిస్తున్నారు.
దోచుకున్న దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇవ్వండి..
ప్రస్తుతం టెండర్లు పిలిచిన పులివెందుల వైద్య కళాశాలను అధునాతన హంగులతో గత ప్రభుత్వంలోనే నిర్మించి, వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన మూడు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించే నాటికే సిద్ధంచేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రూ.వేల కోట్ల విలువచేసే ఈ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోంది.
కళాశాలలను దక్కించుకునే వ్యక్తులు వైద్య విద్యార్థుల నుంచి ఫీజులు, ప్రజల నుంచి చికిత్సల రూపంలో దోచుకున్న దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇవ్వాలనే విధానాన్ని ప్రభుత్వ పెద్దలు రూపొందించారు. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు పోనూ, మిగిలిన పనులన్నీ పూర్తిచేసి, కళాశాల, ఆస్పత్రి నిర్వహిస్తూ ఏటా ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలనే దానిపై సంస్థలు ఫైనాన్షియల్ బిడ్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇక కళాశాలలు దక్కించుకుని తరగతులు ప్రారంభించిన ఏడాది నుంచి సదరు సంస్థ ప్రభుత్వానికి ఇస్తామన్న సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై ఏటా ఐదు శాతం పెంపు ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలా 66 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ప్రీ–బిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టర్ల నుంచి వచ్చే అభ్యంతరాల ఆధారంగా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

ముఖ్య తేదీలు..
ప్రీ బిడ్ మీటింగ్ : అక్టోబరు 3
బిడ్డర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ : అక్టోబరు 4
బిడ్ల దాఖలుకు చివరి తేదీ : అక్టోబరు 24
టెక్నికల్ బిడ్ల ఓపెనింగ్ : అక్టోబరు 24