పాపికొండల విహారయాత్రకు బ్రేక్ | Temporary Break For Papikondalu Excursion | Sakshi
Sakshi News home page

పాపికొండల విహారయాత్రకు బ్రేక్

Jun 28 2026 10:46 AM | Updated on Jun 28 2026 11:10 AM

Temporary Break For Papikondalu Excursion

సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం జిల్లా, చోడవరం పాయింట్ నుంచి పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. వాతావరణ మార్పుల దృష్ట్యా బోటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. వచ్చే వారం రోజుల్లో భారీ వర్ష సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పర్యాటకాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వారాంతం కావడంతో భారీగా ఆన్‌లైన్‌లో టికెట్స్ అమ్మకాలు జరిగాయి.

జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం నుంచి, అలాగే పోలవరం జిల్లాలోని పోచవరం నుంచి భద్రాచలం కేంద్రంగా పాపికొండల పర్యటనకు వందల సంఖ్యలో, సెలవుదినాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతుంటారు. తాజా ఘటనతో పోచమ్మ ఆలయం నుంచి పర్యాటక బోట్లను రెవెన్యూ, పర్యాటక శాఖలు నిలిపివేయడంతో ముందుగానే ప్లాన్‌ చేసుకుని వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత అకస్మాత్తుగా బోట్లను నిలిపివేయడంపై వారు అసహనం వ్యక్తం చేస్తూ వారి ప్రణాళికలను మార్చుకున్నారు.

కాగా, ఒక చిన్న అనాలోచిత నిర్ణయం విభిన్న వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 15 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం గండి పోశమ్మ వద్ద నుంచి పర్యాటకులతో బయలుదేరిన బోటు అడుగుభాగంలో ఉండే ఇంపెల్లర్‌ (ఫ్యాను)కు చేపల వల చిక్కుకుని నిలిచిపోయింది.

దీంతో సదరు అధికారులు ఆ బోటును మాత్రమే నిలిపివేసి మరమ్మతు చేసిన అనంతరం తిరిగి వినియోగంలోనికి తీసుకువచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా మొత్తం పర్యాటక బోట్లను నిలిపివేయాలని ఆదేశాలివ్వడం అటు పర్యాటకులలోనూ, ఇటు బోటు యజమానుల్లోనూ తీవ్ర గందరగోళాన్ని నింపింది. ఇది జరిగి 15 రోజులైనా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో నివాసం ఉండే పర్యాటక శాఖామంత్రి దేశ, విదేశీ పర్యటనల్లో పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని ఢాంబికాలు పోవడం తప్ప చేస్తున్నది శూన్య మని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల పర్యాటకం అంతకంతకూ నిస్తేజమవుతున్నా పట్టించుకోవ డం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. దేశంలోనే అత్యంత ఆహ్లాదకరమైన పాపికొండల పర్యాటకం ఎ ప్పుడు నడుస్తుందో ఎప్పుడో ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని యాత్రికులు అంటున్నారు.

గండి పోచమ్మ గుడి కేంద్రంగా 15 ఏసీ లగ్జరీ బోట్లు పాపికొండల పర్యటనకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సాధారణ రోజుల్లో 400 మంది పర్యాటకులు, శని ఆదివారాల్లో సుమారు వెయ్యి మంది వరకు పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆ ఆలయం నుంచి రాకపోకలు సాధించే పర్యాటక బోట్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఒక్క బోటు నిలచిపోవడంతో అన్ని బోట్లను నిలిపివేయాలని నిర్ణయించడం పర్యాటకుల్లో అభద్రతాభావాన్ని పెంచింది. లోపం ఏర్పడిన సంబంధిత బోటును ఒకటి రెండు రోజుల్లో సరిచేసి పర్యాటకాన్ని కొనసాగించాల్సింది పోయి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అని పర్యాటకులు దుయ్యబడుతున్నారు. 

తాజాగా వర్షం హెచ్చరికతో.. 
భద్రాచలం కేంద్రంగా పోలవరం జిల్లాలోని పోచవరం నుంచి రాకపోకలు సాగించే 20 పర్యాటక బోట్లను వర్షం హెచ్చరికలతో శని, ఆదివారాల్లో నిలిపివేశారు. దీంతో సుమారు 1600 మంది పర్యాటకుల సంతోషం నీరుగారిపోయింది. ఇప్పటికైనా సంబంధిత మంత్రి దుర్గేష్‌ స్థానికంగా జరుగుతున్న పాపికొండల పర్యాటకంపై దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాపికొండల పర్యాటకులకు సౌకర్యాల కల్పనలో నిరంతరం శ్రమించే వందలాది కుటుంబాలు నేడు వ్యాపారాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోట్లలో పనిచేసే కార్మికులు సైతం జీతాలు రాక, ట్రావెల్స్, క్యాటరింగ్, టిఫిన్‌ సెంటర్ల యజమానులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement