ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా! | Telangana police seize Cocaine and ephedrine drugs worth Rs 1 crore | Sakshi
Sakshi News home page

ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!

Jun 4 2025 2:17 AM | Updated on Jun 4 2025 2:17 AM

Telangana police seize Cocaine and ephedrine drugs worth Rs 1 crore

తిరుపతి నుంచి కొకైన్, ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌కు తరలింపు 

రూ.కోటి విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న తెలంగాణ పోలీసులు  

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు 

అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న వైనం 

ప్రధాన నిందితుడు ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ గుణశేఖర్‌ పరారీ

కూటమి ప్రభుత్వం, పోలీసు శాఖ వైఫల్యాన్ని ఇతరులపైకి నెట్టే కుటిల యత్నం  

పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్‌ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్‌ దందా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన కొకైన్‌ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. 

జీడిమెట్ల(హైదరాబాద్‌)/తిరుపతిక్రైమ్‌: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కొకైన్, ఎఫిడ్రిన్‌ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్‌ ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ పరారీలో ఉన్నాడు.

వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌ షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి, ఎస్‌వోటీ డీసీపీ డి.శ్రీనివాస్‌ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

స్నేహితుడి చేత డ్రగ్స్‌ తరలింపు  
తిరుపతికి చెందిన గుణశేఖర్‌ ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పంపించాడు. గుణశేఖర్‌ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్‌ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్‌పల్లికి చేరుకున్నాడు. 

ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్‌ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్‌ మస్తాన్‌ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో కలుసుకున్నారు.  

జూన్‌ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. 
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్‌ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్‌పల్లి భాగ్యనగర్‌ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్‌ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. 

అసలు డ్రగ్స్‌ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్‌పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్‌పెక్టర్‌ రాజేశ్, బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్స్‌పెక్టర్‌ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు.   

పోలీస్‌శాఖ ఆరా  
గుణశేఖర్‌ తిరుపతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్‌తో హైదరాబాద్‌లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్‌ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్‌ గుణశేఖర్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్‌ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్‌మేన్‌గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే.  

Advertisement
 
Advertisement
Advertisement