తడబడే వయస్సు.. పొరబడే మనస్సు! | Teenage: crucial stage of life | Sakshi
Sakshi News home page

తడబడే వయస్సు.. పొరబడే మనస్సు!

Jun 24 2025 5:56 AM | Updated on Jun 24 2025 5:56 AM

Teenage: crucial stage of life

ఇంటర్‌లో కౌమార దశ

గాడితప్పితే జీవితమే గందరగోళం 

చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే లక్ష్యానికి చేరువ  

క్రమశిక్షణతో సాగితే విజయం ఖాయం

నిన్నటి వరకు పాఠశాల చదువు.. ఒక్కసారిగా కళాశాల వాతావరణం.. ఇంటర్‌ విద్యార్థులకు ఇదో కొత్త అనుభవం.  కొత్త వారితో పరిచయాలు, సరికొత్తగా అనిపించే ఆలోచనలు.. ఇప్పుడిప్పుడే కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థికి ఇలా అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. టీనేజ్‌లో ఇంటర్మిడియెట్‌ దశ అత్యంత కీలకం. జీవితాన్ని మలుపు తిప్పాలన్నా ఇదే ముఖ్యమైన కాలం.  ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. జీవితం మళ్లీ మన చేతుల్లోకి రానంత వెనక్కి వెళ్తుంది. అందుకే ఇప్పుడిప్పుడే జూనియర్‌ కళాశాలల్లో చేరుతున్న వారు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఇంటర్‌ దశ కొత్త బంగారులోకమై భవిష్యత్‌ ఉజ్వలమయమవుతుంది.  

నంద్యాల(న్యూటౌన్‌): తొలిసారి ఎదుర్కొన్న పది పబ్లిక్‌ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలను చేరామన్న ఉత్సాహం.. కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కల్గించే ఆనందం.. ఇలా అన్నీ వెరసి విద్యార్థులకు ఇంటర్మిడియెట్‌ దశ ఓ కొత్త బంగారు లోకమే. అనువైన గ్రూపు, ఇష్టమైన సబ్జెక్టులు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇదని చెప్పవచ్చు. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్‌లోనే పడతాయనడంలో అతిశయోక్తి లేదు.

ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించినా, గాడి తప్పి అధఃపాతాళానికి పడిపోయినా.. అంతా ఇంటర్‌లోనే బీజాలు పడతాయని చెప్పుకోవచ్చు. హైసూ్కల్‌ విద్యతో మొదలయ్యే కౌమార ప్రాయం ఇంటర్‌లో మరింత పురి విప్పుతుంది. అందుకే జాగ్రత్త పడాలి. సినిమాల ప్రభావంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమాయణమంటూ మనసు కలుషితం చేసుకోకూడదు. స్నేహితులే లోకంగా అని్పంచే వయస్సులో వారికి అతి ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రుల, ఆధ్యాపకులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దురి్వనియోగం చేస్తే భవిష్యత్‌ అంధకారమే.  

చదువుకే ప్రాధాన్యం.. 
ఇంటర్‌లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి.  విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.

సమయం.. సద్వినియోగం 
ఇంటర్‌లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు.   మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని  వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.  

వ్యసనాలకు దూరంగా ఉండాలి..  
జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్‌ఫోన్‌ వైరస్‌ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పారీ్టలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది.  

స్నే‘హితులు’  
ఇంటర్‌లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి.  

లక్ష్యానికి తొలి అడుగులు.. 
భవిష్యత్‌లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర ఏ కోర్సుకైనా తొలి అడుగు పడాల్సింది ఇంటర్‌లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. 

Advertisement
 
Advertisement
Advertisement