ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏఐతో బోధన | Teaching with AI in Government Degree Colleges | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏఐతో బోధన

Mar 23 2024 5:42 AM | Updated on Mar 23 2024 12:32 PM

Teaching with AI in Government Degree Colleges - Sakshi

ప్రస్తుత సెమిస్టర్‌ నుంచి ఆరు కళాశాలల్లో అమలు

ఇప్పటికే కళాశాలలకు చేరిన జెడ్‌స్పేస్‌ సాంకేతిక టెక్నాలజీ 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా 50 కళాశాలలకు పెంపు

తొలుత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఏఐ బోధన

త్రీడీ అద్దాలు లేకుండానే ఆ అనుభూతిని కలిగించేలా వర్చువల్‌ ల్యాబ్స్‌

వీఆర్, ఏఆర్‌ విధానంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి బోధన ప్రమాణాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)తో పాఠాలు బోధించనుంది. అధ్యాపకులు పాఠ్యపుస్తకాలు చూ­స్తూ, బ్లాక్‌ బోర్డులపై రాస్తూ పాఠాలు చెప్పే విధా­నా­న్ని ఏఐతో భర్తీ చేయనుంది.

విద్యార్థులను ఆకట్టుకుంటూ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా అగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలి­టీ (వీఆర్‌)ల్లో బోధించనుంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘వర్చువల్‌ లెర్నింగ్‌ ల్యాబ్స్‌’ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ అమెరికాకు చెందిన ‘జెడ్‌ స్పేస్‌’ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

తొలి దశలో సైన్స్‌ పాఠాలు..
విద్యార్థులకు పాఠ్యాంశాలను త్రీడీ విధానంలో విజువలైజ్‌ చేసి బోధించడం తాజా ప్రాజెక్ట్‌ లక్ష్యం. ఇందుకోసం జెడ్‌స్పేస్‌ అందించే ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను వినియోగించనున్నారు. తొలి దశలో సైన్స్‌ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల పాఠ్యాంశాలకు వర్చువల్‌ కంటెంట్‌ను తయారు చేసి బోధన చేయనున్నారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో సుమారు 40 టాపిక్స్‌కు చెందిన కంటెంట్‌ను జెడ్‌స్పేస్‌ ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా మరో 60 టాపిక్స్‌కు కంటెంట్‌ను కళాశాల విద్యాశాఖ రూపొందించనుంది. దీనికోసం జెడ్‌స్పేస్‌ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
 
పైలట్‌ ప్రాజెక్టుగా ఏఐ బోధన..
ఇప్పటికే ప్రభుత్వం డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే 2023–24లో సింగిల్‌ మేజర్, సింగిల్‌ మైనర్‌ సబ్జెక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో పరిపూర్ణ విజ్ఞానాన్ని సాధించేలా మార్గం సుగమం చేసింది.

ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్‌ మేజర్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందిస్తోంది. ఆర్ట్స్‌లో 23, కామర్స్‌లో 15, బయోలాజికల్‌ సైన్స్‌లో 15, ఫిజికల్‌ సైన్స్‌లో 15, కెమికల్‌ సైన్స్‌లో 5, మ్యాథ్స్‌లో 3, ఒకేషనల్‌ కోర్సుల్లో 4 ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నాలుగు కోర్సుల్లో సింగిల్‌ మేజర్లు ఉన్న కళాశాలల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ‘ఏఐ’ విధానంతో బోధనను తెస్తోంది. 

త్రీడీ అద్దాలు లేకుండానే..
జెడ్‌స్పేస్‌ ల్యాప్‌టాప్‌లు వర్చువల్‌ రియాలిటీ సామర్థ్యాలతో కూడిన పోర్టబుల్‌ వర్క్‌స్టేషన్‌లుగా పనిచేస్తాయి. దీన్ని ఉపయోగించే వ్యక్తులు త్రీడీ అద్దాలు ధరించాల్సిన అవసరం లేదు. ఇందులోని వర్చువల్‌ ఆబ్జెక్టులు స్క్రీన్‌ వెలుపల, లోపలకి కదలాడుతూ వాస్తవికంగా కనిపిస్తాయి. ఉదాహరణకు అనాటమీ టాపిక్‌ బోధనలో మానవ శరీర నిర్మాణాన్ని త్రీడీ ఇమేజ్‌ల ద్వారా ఒక్కో లేయర్‌ను వివరిస్తూ లోపలి భాగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలుగా బోధన చేయొచ్చు.

వాస్తవానికి జెడ్‌స్పేస్‌ ల్యాప్‌టాప్‌ ఎదురుగా కూర్చుని ఆపరేట్‌ చేసే వ్యక్తికి మాత్రమే త్రీడీ ఎఫెక్ట్స్‌లో సబ్జెక్ట్‌ కనిపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకంగా జెడ్‌వ్యూ కెమెరాను అమర్చడం ద్వారా ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ఎక్కువ మందికి స్క్రీన్‌పై త్రీడీ అనుభూతిని అందించవచ్చు. ఇందుకు వీలుగా సాధారణ ప్రొజెక్టర్స్‌ స్థానంలో అత్యాధునిక ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది.  

తొలుత ఆరు కళాశాలల్లో..
ప్రస్తుత సెమిస్టర్‌ నుంచి ఏఐ టెక్నాలజీ సాయంతో బోధన చేసేందుకు వీలుగా కళాశాల విద్యాశాఖ ఆరు కళాశాల­లను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కడప (మహిళ), అనంతపురం (మెన్‌), రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌– సీవీఆర్‌ డిగ్రీ కాలేజీ, గుంటూరు (మహిళ), విశాఖపట్నంలోని వీఎస్‌ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జెడ్‌స్పేస్‌ ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా సుమారు 50 కళాశాలల్లో అమలు చేయనుంది. జెడ్‌స్పేస్‌ సాంకేతికత వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులకు సైతం శిక్షణ పూర్తయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement