
టీచర్ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం
మహిళా టీచర్ మృతి భర్త, కుమార్తె పరిస్థితి విషమం
చిత్తూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు.. అదే సమయంలో కుమారై ఇంటర్‌లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగీ ఇంటికి వెళ్లే సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త , కుమారై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఆదివారం జరిగింది.
దీంతో మూడు జిల్లాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారై కీర్తన (17) , కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. ఇలా ఉండగా వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమారై ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ గుడివాడలో 7వ తరగతి చదువుతున్నాడు. అంతా సంతోషంగా పున్నమి రోజున శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని భక్తితో పూజించుకుని , మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు.
మార్గ మధ్యలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరమణ, కుమారై కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు.
మూడు జిల్లాల్లో విషాదం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శారద, వెంకట రమణ కుటుంబం పుట్టపర్తి జిల్లా కదిరిలో నివాసం ఉన్నారు. శారద అదే మండలం బాలప్పగారిపల్లెలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, బంధుమిత్రుల రోదనలు పలువురిని కలచివేసింది.