
తమ్మిలేరులో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల చేతుల్లో తమ్మిలేరు విధ్వంసం
అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు... గట్లపై పచ్చ రాబందులు
రాత్రింబవళ్లు వందల టిప్పర్లతో భారీగా అక్రమ రవాణా
ఏలూరు నగర శివారులో ఓ ఎమ్మెల్యే ముఠా అరాచకం
ఐదు కిలోమీటర్ల దూరంలో మరో ఎమ్మెల్యే టీమ్ దందా
ఇప్పటికే ఇసుక స్వాహా.. గట్ల విధ్వంసంతో గ్రావెల్ కూడా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే ఇసుకను ఆసాంతం తోడేశారు...! ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు..!
ఏలూరు జిల్లాలోని తమ్మిలేరును ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ముఠాలు ఎడాపెడా తవ్వేస్తున్నారు..! అది కూడా ఏరులోని గ్రావెల్‌ను కాకుండా గట్లను ధ్వంసం చేస్తుండడం గమనార్హం..! ఇద్దరు ప్రజాప్రతినిధుల పచ్చ ముఠాలు పోటీ పడి తవ్వకాలు చేపడుతూ విచ్చలవిడి విక్రయాలకు తెరతీశారు. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ జేసీబీలతో తవ్వి నిత్యం వందల లారీల్లో గ్రావెల్‌ను తరలిస్తున్నా అటు జల వనరుల శాఖ అధికారులు గాని, ఇటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా పోతువారిగూడెంలో ప్రారంభమై వందల మైళ్ల ప్రయాణంతో చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల మీదుగా ఏలూరు రూరల్ మండలం నుంచి ఏలూరులోకి ప్రవేశిస్తుంది తమ్మిలేరు. తూర్పు, పశ్చిమ తమ్మిలేరుగా విడిపోయి కొల్లేరులో కలిసే సహజ సిద్ధ కాల్వ ఇది.
దశాబ్దాలకోసారి తమ్మిలేరుకు వరద వస్తుంది. దీంతో ఏలూరు నగరం జల దిగ్బంధం అవుతుంది. 1960 నుంచి 4–5 సార్లు ఇలా జరిగింది. ఇలాంటి తమ్మిలేరుపై పచ్చ రాబందుల కన్నుపడింది. కూటమి ప్రభుత్వం రాగానే విరుచుకుపడి దాదాపు 16 ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేసి వేల ట్రాక్టర్ల ఇసుకను విక్రయించారు. ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు.
రోడ్డు వేసి మరీ..
ప్రత్యేక చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాల కనుసన్నల్లో తమ్మిలేరులోకి రోడ్డు వేసి తవ్వేస్తున్నారు. ఏలూరు శివారు ప్రభుత్వ హౌసింగ్ వెంచర్ సమీపం నుంచి తమ్మిలేరులోకి రోడ్డు ఏర్పాటు చేశారు. వెంచర్ వద్ద నలుగురు మనుషులతో చెక్‌పోస్టు పెట్టారు. అక్కడ పనిచేసే సిబ్బంది, లారీ డ్రైవర్ల భోజన విరామం, షిప్టులు మారే సమయం మినహా రోజులో 18 నుంచి 20 గంటల వరకు అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ జేసీబీలతో పది అడుగుల గట్లను తవ్వి లారీల్లో నింపుతున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను సగటున రూ.7 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు.
⇒ పెదవేగి మండలం వంగూరు సమీపంలోని తమ్మిలేరులో తవ్వకాలు నిరంతరం సాగుతున్నాయి. ఓ ఎమ్మెల్యే ముఠా ప్రధాన రహదారి వెంట పట్టపగలే ప్రైవేటు సెక్యూరిటీ నడుమ గ్రావెల్ దందా కొనసాగిస్తోంది. దాదాపు కిలోమీటరు పైగా గట్టును ధ్వంసం చేసి వందల టిప్పర్లల్లో తరలించారు.
⇒ అక్కడనుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో మరో ఎమ్మెల్యే ముఠా తమ్మిలేరు గ్రావెల్‌ను, సిల్ట్ ఇసుకను తవ్వుతోంది. జానంపేటలోని పోలవరం అక్విడెక్ట్ దాటిన తర్వాత ఇదే తరహాలో ప్రత్యేక టీమ్ పర్యవేక్షణలో రాత్రింబవళ్లు తవ్వకాలు సాగించి గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు.
⇒ ఏలూరు శివారులోని పచ్చ ముఠా ఏలూరు,కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో, జానంపేటలోని మరో ముఠా దెందులూరు, చింతలపూడి, నూజివీడులో విక్రయాలు సాగిస్తుస్తోంది.
⇒రోజూ రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన గ్రావెల్‌ను దోచుకుంటున్న సంగతి అధికారులకు తెలిసినా కనీసం కేసులు కూడా లేకపోవడం గమనార్హం.