అనంతపురం జిల్లా కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలో నాగలకట్ట, రావిచెట్టు, వేపచెట్టును తొలగించిన దృశ్యాలు
రూ.5 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను
గత వైఎస్సార్‌సీపీ హయాంలో పారని వీరి పాచిక
సర్కారు మారడంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు
జేసీబీతో 44 సెంట్ల స్థలం చదును..
రాప్తాడు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి అండ
దురాక్రమణను అడ్డుకుంటున్న స్థానికులు, మాజీ ప్రజాప్రతినిధులు
ఆక్రమణదారుపై ఫిర్యాదు నమోదుకు పోలీసుల వెనకడుగు
ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో సైలెంట్
మరోవైపు ఈ జాగా విక్రయానికి అక్రమార్కుల బేరం
రాప్తాడు రూరల్: అది ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలం. అంటే పూర్తిగా పంచాయతీ స్థలం. ఇక్కడ పార్కు, బడి, గుడి నిర్మించొచ్చు. లేదా ఇతరత్రా ప్రజా అవసరాలకు వాడుకోవచ్చు. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ స్థలం చాలా ఖరీదుగా మారింది. దీంతో కొందరు కబ్జారాయుళ్లు దీనిపై కన్నేశారు. వీరికి అధికార పార్టీకి చెందిన కొందరు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా రూ.5 కోట్ల విలువైన ‘ఓపెన్’ (కామన్) స్థలం అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడింది. కానీ, స్థానికులు తమ శక్తిమేరా వీరి ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాలివీ..
వైఎస్సార్‌సీపీ హయాంలో సాగని ఆటలు..
అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ ఐజీ నగర్ పక్కన 21 సర్వే నంబరులో 8.91 ఎకరాల్లో గొంది రామలక్ష్మమ్మ 2007లో లేఔట్ వేశారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం (కామన్ సైట్) 44 సెంట్ల స్థలాన్ని వదిలారు. ఈ ఓపెన్ స్థలంపై కొందరి కన్నుపడింది. 2009 ఏప్రిల్‌లోనే జి. రాజేంద్రనాయుడు, తుమ్మలనాయుడు, వి. హనుమంతునాయుడు, నాగేంద్ర, ఎన్. తారక రామేశ్వర్ పేర్ల మీద జీపీఏ చేయించుకున్నారు. ఈ స్థలంలో పాగా వేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే అక్రమార్కులు ప్రయత్నించారు.
ఇందులో భాగంగా కొందరి పేర్ల మీద అగ్రిమెంటు కూడా చేయించారు. క్షేత్రస్థాయికి వెళ్లేసరికి స్థానికులు, అప్పటి ప్రజాప్రతినిధులు, సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. ఓపెన్ స్థలం అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, రక్షణ చర్యలు చేపట్టాలని అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 44 సెంట్ల ఓపెన్ స్థలంలో కక్కలపల్లి పంచాయతీ నిధులతో పార్కు అభివృద్ధి చేయాలంటూ 2021 అక్టోబరు 14న అహుడా వైస్ చైర్మన్ లేఖ కూడా రాశారు.
చంద్రబాబు ప్రభుత్వం రాగానే..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాకోరులు మళ్లీ రంగంలోకి దిగారు. రాప్తాడు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఈ క్రమంలో ఐదునెలల కిందట 44 సెంట్ల స్థలాన్ని జేసీబీలతో చదును చేసేందుకు కబ్జాదారులు ప్రయతి్నంచారు. స్థానికులు ఏర్పాటుచేసుకున్న నాగులకట్టను సైతం ధ్వంసం చేశారు. రావి, వేప చెట్లను తొలగించడంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో.. ‘ఈ స్థలం మాది.. ఎవరొచి్చనా ఏమీకాదు. మీకు కావాలంటే 8 సెంట్లు వదిలిపెడతాం. లేదంటే అదీలేదు’.. అని కబ్జాదారులు హెచ్చరించారు.
స్థానికులు వెంటనే అనంతపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జేసీబీతో పనులు చేయిస్తున్న నాగేంద్ర (రిజి్రస్టేషన్ చేయించుకున్న వారిలో ఒకరు) తదితరులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదుకు వెనకడుగు వేశారు. ‘ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్‌కాల్’ రావడంతో పోలీసులు సైలెంట్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అయితే, అధికార పారీ్టకి చెందిన నేతల అండ ఉండడంతో అక్రమార్కులు తాజాగా మళ్లీ రంగంలోకి దిగారు. ఈ స్థలం తమదేనని, విక్రయిస్తామంటూ కొనుగోలుదారులకు చూపిస్తున్నారు. తరచూ వాహనాల్లో వచ్చి ఈ స్థలాన్ని చూసి వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఒక్క సెంటూ అన్యాక్రాంతం కానివ్వం..
కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని 21 సర్వే నంబరులోని ప్రైవేట్ లేఔట్‌లో ప్రజాప్రయోజనాల కోసం 44 సెంట్ల స్థలాన్ని వదిలారు. ఇది పూర్తిగా పంచాయతీకి సంబంధించిన స్థలం. ఎవరు ఆక్రమించినా క్రిమినల్ కేసులు నమోదుచేయిస్తాం. త్వరలోనే అక్కడ ఒకవైపు అంగన్‌వాడీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. మరోవైపు.. నరిగమ్మ ఆలయం నిర్మాణానికి పరిశీలిస్తున్నాం. మిగతా స్థలంలో పార్కు ఏర్పాటుచేస్తాం. ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కానివ్వం. ప్రజలకు ఉపయోగపడేలా చూస్తాం. – తహసీల్దార్ మోహన్‌కుమార్,ఎంపీడీఓ దివాకర్


