గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందిస్తున్న అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ ప్రతినిధులు
ఆగని చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు
రూ.వందల కోట్ల విలువైన భూములపై పచ్చగద్దల కన్ను
టైటిల్ మార్పు కుదరదన్న వక్ఫ్‌బోర్డు తీర్మానం సైతం బేఖాతర్
ముస్లిం సమాజం నిరసిస్తున్నా బాబు సర్కారు పన్నాగాలు
వక్ఫ్ చట్టానికి విరుద్ధంగా ఏపీఐఐసీకి బదలాయించే ఎత్తులు
ఏపీఐఐసీ నుంచి ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో ఫలహారం
చినకాకానిలో అంజుమన్ ఎ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాలకు నోటిఫికేషన్
అభ్యంతరాలకు 60 రోజుల గడువిచ్చిన కలెక్టర్
ఆపై గుంటూరు జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెం భూమి 238.18 ఎకరాలు..
తాడికొండ మసీదు భూమి వంద ఎకరాలు.. కొండపల్లి ఖాజీ మాన్యం 50 ఎకరాలపైనా కన్ను
సాక్షి, అమరావతి: వక్ఫ్ భూములా..! ఉఫ్ మనిపించేద్దాం అన్నవిధంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ ధోరణి. రూ.వందల కోట్ల విలువైన భూములను పచ్చ గద్దలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేసింది. గత ఏడాది మొదలైన ఈ ప్రయత్నాలకు వక్ఫ్‌బోర్డు తీర్మానంతో తాత్కాలిక బ్రేక్ పడినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ చట్టానికి విరుద్ధం అంటూ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నా... లీజుకైతే ఓకే, వక్ఫ్ ఆస్తుల టైటిల్ మార్పునకు వీల్లేదు.. అని బోర్డు చెబుతున్నా భూములను కాజేసే కుట్రలు ఆగడం లేదు. విలువైన ఆస్తులను పరులపాలు చేసి, దాతల ఆశయాన్ని దెబ్బతీయొద్దని ముస్లిం సమాజం ఎన్ని విధాలుగా కోరుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తన దారుణమైన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది.
⇒ గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలు, గుంటూరులోని అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోంది. మల్లాయపాలెంలోని భూములను ఏపీఐఐసీకి భూ సేకరణ పేరుతో అప్పగించేందుకు గత ఏడాది మార్చిలో తెనాలి సబ్ కలెక్టర్ ఏపీఐఐసీ అ«ధికారులకు లేఖ రాయడాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను పచ్చ నేతలకు అప్పగించేందుకు చేసిన ఆ ప్రయత్నాలను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది.
టైటిల్ మార్చడానికి కుదరదన్నా...
మల్లాయపాలెం వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయం సాధించలేమని భావించిన వక్ఫ్‌బోర్డు గతంలో రెండుసార్లు సమావేశాలను వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత జిల్లా నెల్లూరులో నిరుడు జూలైలో నిర్వహించిన సమావేశం వక్ఫ్ టైటిల్‌ను మార్చడాన్ని (పూర్తిగా అన్యాక్రాంతం) తిరస్కరించింది. భూములను లీజు, పీపీపీ పద్ధతిలో మాత్రమే ఇస్తామని తీర్మానించింది.
ఇదే విషయాన్ని ప్రభుత్వానికీ నివేదించింది. ఏపీ భూ సేకరణ చట్టం–2018లోని సెక్షన్ 22ని అనుసరించి అతి తక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేయగా... కుదరదని తేలి్చచెప్పింది. లీజు, పీపీపీలో అభివృద్ధి ఏది కావాలో ఎంచుకోమని సూచించడం గమనార్హం. అయితే, ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చేసిన లీజు, పీపీపీ రెండు ప్రతిపాదనలను కొందరు బోర్డు సభ్యులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ భూములను లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం–1995లోని సెక్షన్–51 స్పష్టం చేస్తోందని చెబుతున్నారు.
మళ్లీ నోటిఫికేషన్‌తో కలకలం
తాజాగా గుంటూరు అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూ సేకరణ ద్వారా తీసుకుంటున్నామని, అభ్యంతరాలు ఉంటే 60రోజుల్లో తెలపాలని జిల్లా కలెక్టర్ డిసెంబరు 19న నోటిఫికేషన్ ఇచ్చారు.
దీంతో వక్ఫ్ భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లైంది. మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను కూడా మలేసియా కంపెనీలకు ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ధారాదత్తం చేసేందుకు చర్చలు జరిగాయి. ఆ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. తాడికొండ జామియా మసీదుకు చెందిన వంద ఎకరాలు, కొండపల్లి ఖాజీ మాన్యం 50 ఎకరాలను కూడా భూ సేకరణ పేరుతో తీసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ఊపందుకున్నట్టు సమాచారం.
న్యాయ పోరాటం చేస్తాం
ముస్లిం సమాజంలోని పేదల అభివృద్ధి, సంక్షేమం, పిల్లల విద్యను కాంక్షిస్తూ దాతలు మహోన్నత ఆశయంతో భూములు ఇచ్చారు. దానిని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం. వక్ఫ్ భూములను ఇతర శాఖలు, వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడం సరికాదు. ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వానికి వక్ఫ్‌బోర్డు ఆస్తుల టైటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయడం సాధ్యం కాదు. లీజు, పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసి వక్ఫ్‌బోర్డుకు ఆదాయం పెంచి ముస్లింల సంక్షేమం, విద్యకు ఉపయోగించాలి. – షేక్ నాగుల్‌మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు
చినకాకాని వక్ఫ్ భూముల భూ సేకరణ నిలిపేయాలి
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చినకాకాని గ్రామంలో ఉన్న వక్ఫ్ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ కార్యదర్శి షేక్ సైదా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించింది. పారిశ్రామిక పార్కు పేరుతో 71.57 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ భూములు వక్ఫ్ చట్టం–1995 ప్రకారం నమోదైన వక్ఫ్ ఆస్తులని, వాటిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా సేకరించడం చట్టవిరుద్ధమని, ఈ భూ సేకరణ చర్యలు చెల్లుబాటు కావని చెప్పారు. వక్ఫ్ భూముల భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్‌కు అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.


