శ్రీకాళహస్తిలో ఆక్రమణకు గురైన దళితుల భూమి
శ్రీకాళహస్తి ఎంఎం వాడలో టీడీపీ నేతల కుతంత్రం
రూ.154 కోట్ల విలువైన 3 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్.. రికార్డులు తారుమారు
సబ్‌డివిజన్ల పేరుతో కుట్ర
నకిలీ పేర్లతో రిజిస్ట్రేషన్లకు సన్నాహాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు రూ.154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు. సబ్‌డివిజన్ల పేరుతో కుట్రలు పన్నారు. కొందరిని బెదిరిస్తూ.. నకిలీ వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చారు. ఆక్రమిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ భూ దందాపై అధికార పార్టీలోని మరోవర్గం గుర్రుమంటోంది. టీడీపీ అధినేత, ఆయన తనయుడి దృష్టికి ఈ కబ్జా వ్యవహారం చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది.
పకడ్బందీ ప్రణాళిక
శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఎంఎంవాడలో దళితులకు చెందిన 3 ఎకరాల భూమి ధర ప్రస్తుతం రూ.154 కోట్ల వరకు పలుకుతోంది. దీనిపై ఇటీవల టీడీపీ నేతల కన్ను పడింది. ప్రధానంగా ఇద్దరు బడా నేతలు ఈ భూమిని అప్పనంగా దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. దళితుల భూములను లాక్కొనేందుకు పకడ్బందీ ప్రణాళిక వేశారు. కొన్నాళ్లు వివాదంలో ఉన్న ఈ భూమి చివరకు దళితులకు దక్కింది. దీంతో ఆ భూమిని దిగమింగేందుకు పచ్చ బడా నేతలు కుట్రలు మొదలు పెట్టారు.
పెత్తందారుడి చేతిలో చితికి..
ఒకప్పుడు ఎంఎం వాడలో దళితులకు 7.5 ఎకరాల వరకు భూమి ఉండేది. 1965లో ఆ భూమిని ఓ పెత్తందారుడు మోసం చేసి కాజేశాడు. సంతకాలు తీసుకుని లాగేసుకున్నాడు. క్రమం క్రమంగా ఆ భూములను విక్రయించుకుంటూ వచ్చాడు. తీరా ఆ భూమికి సంబంధించిన దళిత కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. ఆపై కోర్టు నుంచి వారికి క్లియరెన్స్ వచ్చింది. అందులో 3 ఎకరాలు దళితులకు దక్కింది. దళితులకు కోర్టు తీర్పు ప్రకారం వచ్చిన మూడు ఎకరాల విలువ సుమారు రూ.154 కోట్లని తెలిసి పచ్చగద్దలు వాలిపోయాయి. అందులో ఇద్దరు బడా నేతలు చేతులు కలిపి ఎలాగైనా ఆ భూమిని ఆక్రమించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇది తెలిసి అడ్డొచ్చిన దళితులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బెదిరింపులకు గురిచేశారు.
అధికార బలంతో..
అధికారబలంతో దళితుల స్థానంలో కొందరు నకిలీలను తీసుకొచ్చారు. వారిని అడ్డుగా పెట్టుకుని ఆ భూమిని కొట్టేసేందుకు సన్నద్ధమయ్యారు. ముందుగా రెవెన్యూ సిబ్బందిని తమ అధికార బలంతో వశపరుచుకున్నారు. రికార్డులను తారుమారు చేశారు. ఆపై భూమిని జేసీబీలతో చదును చేసి సబ్ డివిజన్లు చేయించారు. సర్వే రాళ్లు కూడా పాతేశారు. నేడు (సోమవారం) రిజిస్ట్రేషన్ చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలిసింది.
కాసులు కుమ్మరించి..
ఈ దందాలో కొందరు రెవెన్యూ అధికారులు, నకిలీ వ్యక్తులకు సదరు బడా నేతలు కాసులు కుమ్మరించారు. పలు ఆఫర్లతోపాటు గిప్ట్‌లు కూడా అందించారు. దాదాపు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ముట్టినట్లు సమాచారం. అయితే ఈ దందాపై మళ్లీ కొందరు దళితులు కోర్టును ఆశ్రయించేందుకు అడుగులు వేస్తున్నారు. మానవహక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
మరోవర్గం మండిపాటు
భూ దందాపై టీడీపీలోని మరో వర్గం మండిపడుతోంది. ఆ ఇద్దరు నేతలు చేస్తున్న దందాను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. సోమవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైతే ఈ విషయాన్ని వెంటనే అధినేతకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలబడి, ఖచ్చితంగా న్యాయం చేస్తామని మరో వర్గంవారు హామీ ఇచ్చినట్లు కొందరు దళితులు చెబుతున్నారు. అలాగే మీడియా ద్వారా మొత్తం వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని పావులు కదుపుతున్నట్లు తెలిసింది.


