
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది.
తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది.

ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్‌స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.