టీడీపీ నాయకుల బరితెగింపు 

TDP Leaders Attack On YSRCP Activists Prakasam District - Sakshi

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపైకి కారు ఎక్కించిన టీడీపీ నాయకులు

ముగ్గురికి తీవ్ర గాయాలు.. ప్రకాశం జిల్లా గొంగటిరెడ్డిపాలెంలో ఘటన  

జరుగుమల్లి: ప్రకాశం జిల్లా గొంగటిరెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను అడ్డుకొని.. కులం పేరుతో దూషించారు. కారును ఊరేగింపు మీదకు దూకించి.. ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. వినాయకచవితి సందర్భంగా గొంగటిరెడ్డిపాలెంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయులు వేర్వేరుగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు.

రెండు రోజుల కిందట టీడీపీ వాళ్లు తమ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ వర్గీయులు తమ విగ్రహంతో నిమజ్జనానికి బయల్దేరారు. ఇంతలో టీడీపీ నాయకుడు బండి మాలకొండారెడ్డి కుమారులైన కొండారెడ్డి, మాల్యాద్రి రోడ్డుకు అడ్డంగా కార్లు పెట్టి.. ఊరేగింపును అడ్డుకున్నారు. దీంతో ‘మీ బొమ్మను మేము అడ్డుకోలేదు కదా.. మాకెందుకు అడ్డు పడుతున్నారు’ అని వారిని వైఎస్సార్‌ సీపీ వర్గీయులు ప్రశ్నించారు.

కొండారెడ్డి, మాల్యాద్రి వెంటనే తమ కార్లను రోడ్డుపై విచక్షణారహితంగా తిప్పుతూ.. ఒక్కసారిగా ఊరేగింపులో ఉన్న వారి మీదకు దూకించారు. మల్లవరపు పోలయ్య అనే వ్యక్తి కాలు మీదకు కారు ఎక్కించిన కొండారెడ్డి.. అతన్ని కులం పేరుతో దూషిస్తూ, ‘మీకు కూడా వినాయకుడు కావాలా..’ అంటూ హేళన చేశాడు. పోలయ్య, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తులు ఎదురుతిరిగి పోలీసులకు సమాచారమివ్వడంతో మాల్యాద్రి పారిపోయాడు. కొండారెడ్డి మాత్రం గోడకు తల బాదుకొని.. తనను కొట్టారంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కందుకూరు ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. గాయపడిన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ సురేష్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top