
మేము టీడీపీ.. అంతా మేం చూసుకుంటాం
చెన్నైలోని వీఎస్‌ఎన్ కంపెనీ డీలర్‌తో టీడీపీ నేత రూప్‌కుమార్ డీల్
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఈయన ప్రధాన అనుచరుడు
డీల్ ఆడియో లీక్ కావడంతో యవ్వారం బట్టబయలు
క్వార్ట్జ్‌అక్రమ మైనింగ్‌లో వారే సూత్రధారులు, పాత్రధారులు
అసలు దోపిడీదారులు టీడీపీ నేతలేనని స్పష్టం
ప్రజలను ఏమార్చేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి పార్టీల నేతల తీరు చూస్తుంటే దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. క్వార్ట్ ్జ, ఇతర మైన్స్, ఇసుక, మద్యం.. ఇలా ఏది తీసుకున్నా ప్రతి అక్రమ వ్యవహారంలో వారే అసలు దోపిడీ దారులుగా కనిపిస్తున్నారు. నింద మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలపై వేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక అనుచరుడు రూప్‌కుమార్ యాదవ్ చెన్నైలోని వీఎన్‌ఎస్ కంపెనీ డీలర్‌తో సాగించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి లీక్ అయిన ఆడియోనే ఇందుకు నిదర్శనం.
దీంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ భేతాళ కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని తేలిపోయింది. ‘నేను టీడీపీ లీడర్ రూప్‌కుమార్‌ను మాట్లాడుతున్నా.. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.. జిల్లాలో ఏ ఏరియా నుంచి అయినా మైకా క్వార్ట్జ్ మెటీరియల్‌ను సరఫరా చేస్తా.. క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా.. మీకు ఎలా పంపాలో చెప్పండి.. రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే.. ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా..’ అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూడటంతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది.
క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఇలా..
నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్ట్జ్ ఫల్స్‌పర్, వర్ముఖ్లైట్ ఖనిజానికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. ఒక్క సైదాపురంలోనే మూత పడిన గనులు 26 ఉండగా, అధికారికంగా 40 ఓపెన్ క్వారీలు ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల వరకు తరగని మైకా క్వార్ట్ ్జ నిల్వలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీ వేమిరెడ్డి, ఆయన అనుచరులు రంగంలోకి దిగారు.
గనుల యజమానులను బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. చైనాతో వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎనిమిది నెలల పాటు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఆపై యజమానులతో నయాన, భయనా డీల్ కుదుర్చుకున్నారు. గనుల్లో నుంచి వచ్చే ప్రతి టన్ను క్వార్ట్జ్ మెటీరియల్ తాము చెప్పిన ధరకే ఇవ్వాలనే డిమాండ్‌తో అనుమతులు ఇప్పించి వ్యాపారం చేసుకుంటున్నారు.
ఏడాదికి 5 లక్షల టన్నులు
ఈ ప్రాంతంలో నెలకు 30 వేల నుంచి 50 వేల టన్నుల మైకా క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సైదాపురం ఖనిజానికి చైనా మార్కెట్‌లో గ్రేడ్‌ను బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ మండలం నుంచే రోజూ వెయ్యి టన్నులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 500 టన్నుల వంతున నెలకు 45 వేల టన్నులు తరలిస్తున్నారు.
అంటే ఏటా 5 లక్షల టన్నుల పైనే అన్నమాట. నాణ్యత గ్రేడ్‌లను బట్టి టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. నెలకు దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజాన్ని అనధికారికంగా సొంతం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి.. ప్రభుత్వ కీలక నేతకు నెలకు రూ.30 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దొరికే క్వార్ట్ ్జను నేరుగా చెన్నై నౌకాశ్రయం ద్వారా చైనాకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రుస్తుం మైన్ పేరుతో భేతాళ కుట్రలు
అక్రమ మైనింగ్ దందాను మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పోలుపోయిన అనిల్‌కుమార్ యాదవ్ తరచూ ప్రశ్నిస్తుండడంతో టీడీపీ పెద్దలు కుట్రలకు తెరలేపారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్‌లో అక్రమ తవ్వకాలు చేశారంటూ భేతాళ కుట్రలు పన్ని వారిని కేసుల్లో ఇరికించారు. ఇప్పటికే కాకాణిపై పలు అక్రమ కేసులు బనాయించి రెండు నెలలుగా జైల్లో ఉంచారు. ఇంకా అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది.
తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌నూ అదే కేసులో ఇరికించారు. కాకాణి అనంతరం అక్రమ కేసుల వంతు బీసీ నేత అనిల్‌కుమార్ యాదవ్‌పై పడింది. రుస్తుం మైన్‌తో సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిల్ కుమార్ యాదవ్ పేరు బలవంతంగా చెప్పించి.. తప్పుడు వాంగ్మూలం తీసుకుని జైలుకు పంపారు.
ఇప్పటికే ఆయన వ్యక్తిగత సహాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వీరి పాత్ర ఉన్నట్లుగా అభూత కల్పనలు అల్లుతున్నారు. ఎల్లో మీడియాలో కట్టుకథలు రాయిస్తున్నారు. చివరకు అనిల్ కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసే వరకు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయిస్తున్నారు.