విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో రూ.50 కోట్ల విలువైన 95 సెంట్ల ఇరిగేషన్ భూమిలో ఏర్పాటు చేసిన టీడీపీ జిల్లా కార్యాలయం
టీడీపీ ఆఫీసులకేమో ఎకరాలకు ఎకరాలు
మచిలీపట్నంలో ఇచ్చిన భూమి విలువ రూ.50 కోట్లు
తిరుపతిలో కేటాయించిన స్థలం ఖరీదు రూ.60 కోట్లు
గతంలోనూ అత్యంత విలువైన భూములను టీడీపీ కార్యాలయాలకు కట్టబెట్టిన చంద్రబాబు
డి–పట్టాలు, వాగు పోరంబోకు భూముల్లో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం
3.60 ఎకరాల్లో స్టార్ హోటల్ మాదిరిగా ఎన్టీఆర్ భవన్.. విశాఖలో దసపల్లా భూములను ఆక్రమించి పార్టీ ఆఫీసు నిర్మాణం
విజయవాడలో రూ.50 కోట్ల విలువైన 95 సెంట్ల స్థలం కేటాయింపు
టీడీపీ కార్యాలయాలకు మున్ముందు వరుసగా రూ.కోట్ల విలువైన భూములు
సాక్షి, అమరావతి: పేదలకు సెంటు స్థలం ఇవ్వదు కానీ, పార్టీ ఆఫీసులకు మాత్రం రూ.వందల కోట్ల విలువైన భూములు కేటాయించుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే వ్యూహంతో టీడీపీ కార్యాలయాల కోసం అత్యంత విలువైన స్థలాలను కారుచౌకగా ఇచ్చేస్తోంది. తాజాగా మచిలీపట్నంలో కట్టెబట్టిన 1.60 ఎకరాల విలువ రూ.50 కోట్లకు పైనే. తిరుపతి రూరల్ మండలం అవిలాలలో ఇచ్చిన రెండెకరాల భూమి విలువ రూ.100 కోట్లు కావడం గమనార్హం.
జనవరిలో కడపలోని రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆర్‌అండ్‌బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద లీజుకు ఇచ్చేశారు. అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానన్న చంద్రబాబు ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా జగనన్న కాలనీల్లో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతూ పేదలలో ఆందోళన రేకెత్తిస్తున్నారు.
మంగళగిరిలో స్టార్ హోటల్ తరహాలో...
చంద్రబాబు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం కేటాయించి అత్యాధునిక భవనాలను కట్టించేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం 3.65 ఎకరాలలో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని అత్యంత విలువైన ప్రాంతంలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చాక కేటాయించుకున్నారు. ప్రస్తుత విలువ రూ.150 కోట్లకుపైనే. ఇందులో వాగు పోరంబోకు, కాలువ, రైతులకు అసైన్ చేసిన డి–పట్టా భూములున్నా నిబంధనలకు విరుద్ధంగా 2016లో 99 ఏళ్ల లీజుకు తీసుకున్నారు.
దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులున్నా ఖాతరు చేయలేదు సరికదా... స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని నిర్మించారు. గుంటూరు అరండల్‌పేట పిచుకులగుంటలో వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం లీజుకుని తీసుకుని పక్కనే ఉన్న 1,500 గజాల స్థలాన్నీ ఆక్రమించి భారీ భవనం కట్టేశారు. మున్సిపల్ స్థలాలను ఎక్కడా లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా 2015లో చంద్రబాబు అధికార బలంతో ఆ భూమిని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు.
విజయవాడ నడిబొడ్డున రూ.50 కోట్ల భూమి
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంతం గురునానక్ కాలనీకి ఆనుకుని ఉన్న 95 సెంట్ల భూమిని 2018లో టీడీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. ప్రజావసరాలకు ఉపయోగపడే ఈ సాగునీటి శాఖ స్థలంలో చిన్న కార్యాలయాలుండగా కూల్చేశారు. ఈ స్థలం ప్రస్తుతం రూ.50 కోట్లపైనే ఉంటుంది. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని వారి నోరు మూయించి మరీ కన్వర్షన్ చేసుకున్నారు.
⇒ శ్రీకాకుళంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ సేకరించి అభివృద్ధి చేసిన భూమిని టీడీపీ కార్యాలయం కోసం లీజు పేరుతో లాగేసుకున్నారు. అందులో పెద్ద భవనాన్ని నిర్మించారు. దీని విలువ ఇప్పుడు రూ.40 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
⇒ కాకినాడలో 2 వేల గజాల జిల్లా పరిషత్ స్థలాన్ని 2014లో టీడీపీ కార్యాలయం కోసం తీసుకున్నారు. దీని విలువ రూ.20 కోట్లకుపై మాటే.
విశాఖలో దస్‌పల్లా కొండను ఆక్రమించి..
విశాఖపట్నంలో దస్‌పల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దస్‌పల్లా భూముల్లో 2 వేల గజాలను ఏడాదికి రూ.25 వేల చొప్పున 33 ఏళ్ల లీజుకు కేటాయించుకున్నారు. పక్కనే ఉన్న మరో వెయ్యి గజాలను ఆక్రమించి కార్యాలయం నిర్మించారు. టెక్కలి, చిలకలూరిపేటలో 30 సెంట్లు, 20 సెంట్ల విలువైన స్థలాలను ఇలానే పొందారు.
హైదరాబాద్‌లోనూ అంతే...
విలువైన స్థలాలను పార్టీ కార్యాలయాల పేరుతో ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు ఘనాపాఠి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఇలానే నిర్మించారు. ఇప్పుడూ రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలువైన స్థలాలు పొంది విలాస భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. సోమవారం మచిలీపట్నం, తిరుపతిలో కేటాయింపులు పూర్తవగా, మున్ముందు అన్నిచోట్ల ప్రభుత్వ భూములను పొందేందుకు సిద్ధమవుతున్నారు.


