'శుభ్ర'కదబ్ర..! | Swachh Sarvekshan has fallen to the bottom in recognition under the coalition government | Sakshi
Sakshi News home page

'శుభ్ర'కదబ్ర..!

Jul 16 2025 5:31 AM | Updated on Jul 16 2025 5:31 AM

Swachh Sarvekshan has fallen to the bottom in recognition under the coalition government

పారిశుద్ధ్యంపై హడావుడి తప్ప ఫలితం శూన్యం  

కూటమి పాలనలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ గుర్తింపులో అట్టడుగుకు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పదుల సంఖ్యలో అవార్డులు 

అప్పట్లో  దేశంలోనే టాప్‌–10లో ఏపీ నగరాలు

2021, 2022, 2023లో వరుసగా హ్యాట్రిక్‌ సాధించిన విజయవాడ, విశాఖ  

ఈసారి ‘టాప్‌’లో దక్కని చోటు.. 3 అవార్డులకే పరిమితమైన నగరాలు 

ప్రతి రంగంలోనూ అబ్రకదబ్ర అంటూ గారడీ చేయడంలో దిట్టయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశుద్ధ్యం విషయంలోనూ అదే విద్యను ప్రదర్శించి చతికిలబడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పట్టణ పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదని, అన్ని మున్సిపాలిటీల్లో 85 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయిందని దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. తన ఏడాది పాలనలో స్వచ్ఛ ఆంధ్ర అంటూ ప్రగల్భాలు పలికి హడావుడి చేసింది తప్ప సాధించింది ఏమీ లేదని తేలిపోయింది. 

ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రకటనలో ఈ విషయం బట్టబయలైంది.  స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే–2024–25 కింద కేవలం జనాభా ప్రాతిపదికన మూడు నగరాలకు మాత్రమే పురస్కారాలు దక్కడం మన రాష్ట్ర దుస్థితిని ఎత్తిచూపింది. గత ప్రభుత్వంలో ఏటా 10కిపైగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు సొంతం చేసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో టాప్‌–10లో కనీసం 3 నగరాలు నిలిచాయి. ఈసారి టాప్‌ ర్యాంకులు లేకపోగా, సరైన గుర్తింపూ లభించకపోవడం కూటమి ‘చెత్త’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది.        – సాక్షి, అమరావతి 

గత ప్రభుత్వంలో దేశంలోనే టాప్‌
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టణ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వినూత్న విధానాలతో పటిష్ట చర్యలతో దేశంలోనే టాప్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితోపాటు అనేక మున్సిపాలిటీలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. పలు విభాగాల్లో ఒక్కో నగరం మూడు, నాలుగు పురస్కారాలను దక్కించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గతేడాది జనవరిలో అవార్డులను ప్రకటించింది. ఇందులో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 

జాతీయ స్థాయిలో ఫైవ్‌ స్టార్‌’ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్లు క్లీన్‌ సిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌తో మరో 5 నగరాలు అవార్డులను దక్కించుకున్నాయి. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్‌ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయి. క్లీన్‌ సిటీ విభాగంలో గ్రేటర్‌ విశాఖపట్నం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరీలో విజయవాడ 6, తిరుపతి 8వ ర్యాంకులు సాధించాయి.  

వరుసగా మూడేళ్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు సాధించి విజయవాడ, జీవీఎంసీ హ్యాట్రిక్‌ సాధించాయి. 2021, 2022, 2023 సంవత్సరాలలో విజయవాడ కార్పొరేషన్‌ ఇండియా క్లీనెస్ట్‌ సిటీ, క్లీన్‌ స్టేట్‌ క్యాపిటల్‌ జాతీయ అవార్డులను, గ్రేటర్‌ విశాఖ బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్, క్లీన్‌ బిగ్‌ సిటీ అవార్డులు వరుసగా సాధించి హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నాయి. తిరుపతి నగరం బెస్ట్‌ స్మాల్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ (2021), సఫాయిమిత్ర సురక్షిత్‌ ప్రెసిడెంట్‌ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుంది. పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022లో బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డును సొంతం చేసుకున్నాయి. 

పులివెందుల 2022లో ఇన్నోవేషన్, బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు, 2023లో స్టేట్‌ అవార్డును దక్కించుకుంది. 2022లో కంటే 2023లో రాష్ట్రంలోని ఎక్కువ నగరాలు స్టార్‌ రేటింగ్‌ ర్యాంకింగ్‌లో టాప్‌లో నిలిచాయి. గార్బేజ్‌ ఫ్రీ సిటీ రేటింగ్‌లో 2022లో జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ వస్తే, 2023లో విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు కర్నూలు, వైఎస్సార్‌ కడప యూఎల్బీలు 3 స్టార్‌ రేటింగ్‌లోనూ, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి వన్‌ స్టార్‌ రేటింగ్‌లోనూ నిలిచాయి. 

కూటమి ప్రభుత్వంలో పడకేసిన ప్రగతి 
దేశంలో పారిశుద్ధ్య విధానాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. 2016 నుంచి దేశంలోని మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ప్రదానం చేస్తోంది. అయితే, గత టీడీపీ ప్రభుత్వంలోగానీ, ఇప్పటి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలోగానీ ప్రచారంలో తప్ప పట్టణ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో స్వచ్ఛతలో దేశంలో వెనుకబడిపోయింది. 

ఇటీవల 2024 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో సూపర్‌ స్వచ్ఛ్‌ లీగ్‌ (జనాభా) కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్లు, మినిస్టీరియల్‌ (స్పెషల్‌) కేటగిరీలో జీవీఎంసీ, స్టేట్‌ లెవెల్‌ విభాగంలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంపికయ్యాయి. గత ప్రభుత్వంలో దేశంలో టాప్‌లో ఉన్న జీవీఎంసీ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలు ఇప్పుడు అట్టడుగుకు పడిపోవడం కూటమి ప్రభుత్వంలో పట్టణ పారిశుద్ధ్యంలో దిగజారిన ప్రమాణాలకు అద్దంపడుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

నాటి స్వచ్ఛ సంకల్పం ఇప్పుడేదీ!
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ఆయా పట్టణాల్లో పారిశుద్ధ్యం విభాగంలో చేపట్టిన విధానాలపై సర్వే చేస్తుంది. అలాగే, బెస్ట్‌ ప్రాక్టీస్‌ విధానాలను పరిశీలిస్తుంది. ప్రజల నుంచి నేరుగా వివరాలు (సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌) తీసుకుని వాటి ఆధారంగా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ‘స్వచ్ఛ సంకల్పం’ పేరుతో పట్టణాల్లో ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం ద్వారా ఇంటింటికీ చెత్తడబ్బాలు ఉచితంగా పంపిణీ చేసి మున్సిపల్‌ కార్మికులు ప్రజల ఇంటి నుంచే నేరుగా చెత్తను వాహనాలకు అందించే విధానం చేపట్టారు. 

స్వచ్ఛ ఆటోలు అందించి అన్ని మున్సిపాలిటీల్లోను చెత్తను ఏరోజుకారోజు డంపింగ్‌ యార్డులకు తరలించి, అక్కడి నుంచి చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు, ఎరువుల తయారీకి తరలించారు. అప్పటి వరకు వీధి మూలల్లోని చెత్త వేసే ప్రాంతాలను శుద్ధిచేసి చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక, తడి–పొడి చెత్తను వేరుచేయడంతోపాటు, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను అత్యంత శ్రద్ధగా అమలు చేశారు. 

మరోపక్క.. రోడ్లు, పారిశుధ్యం, డ్రెయినేజీలు, మొక్కలు నాటడం, జంక్షన్ల సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో 2020 నుంచి 2023 వరకు వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించడంతోపాటు అత్యధిక అవార్డులను సొంతం చేసుకుంది. 2024లో కూటమి ప్రభుత్వం మున్సిపల్‌ పారిశుధ్యంపై తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో రాష్ట్రం స్థాయి దిగజారిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement