ఏపీ సర్కార్‌పై ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court Quashed Controversial Judgment Given By Justice Rakesh Kumar In Ap High Court​ - Sakshi

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

జడ్జి రాకేష్ వివాదస్పద తీర్పు రద్దు

ఏపీ సర్కారు, సీఎంపై నాడు దూషణలు

జస్టిస్ రాకేష్ తీర్పునే కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్‌ 31, 2020న జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్‌ రాకేష్‌.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. 

జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేదీ, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింగ్వీ, నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది.

కేసు పూర్వపరాలేంటీ?

ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్‌ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్‌ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా  వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. 

సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి

దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రాకేష్‌ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు.

సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది?

కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో  జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్‌ రాకేష్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్‌ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. 

జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? 

వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్‌ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్‌ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్  రాకేశ్‌కుమార్‌ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు.

ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్‌

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top