ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు | Supreme Court Key Verdict In SC And ST Cases In Andhra Pradesh, Check Out More Details | Sakshi
Sakshi News home page

ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు

Sep 8 2025 5:20 AM | Updated on Sep 8 2025 11:27 AM

Supreme Court key verdict in SC and ST cases: Andhra Pradesh

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ‘సుప్రీం’ కీలక తీర్పు 

ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టులు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించొచ్చు 

ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు 

ఎఫ్‌ఐఆర్‌ చదివిన వెంటనే ప్రాథమిక ఆధారాలపై ఓ నిర్ధారణకు రావొచ్చు 

కోర్టులు ఆధారాల్లోకి వెళ్లడం.. మినీ ట్రయల్‌ నిర్వహించడం చేయరాదు 

ఎస్సీ, ఎస్టీలు సమాజంలో చాలాకాలంగా అణగారిన వర్గాలుగా ఉన్నారు 

వారి రక్షణ, హక్కుల కోసమే ఈ చట్టం తెచ్చారు 

నిజానికి.. ఈ చట్టం కింద ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉంది 

అయినా, ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్‌కు అది అడ్డంకి కాదు 

బాంబే హైకోర్టు తీర్పును తప్పుపట్టి నిందితుల ముందస్తు బెయిల్‌ను రద్దుచేసిన ధర్మాసనం

‘‘ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉంది. అయితే, ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్‌ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదు’’. ‘‘ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నదానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావొచ్చు. ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం, సంబంధంలేని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చేయరాదు. మినీ ట్రయల్‌ కూడా చేయడానికి వీల్లేదు.’’ 
– ‘‘ఎస్సీ, ఎస్టీలు పౌర హక్కులను కోల్పోకుండా ఉండటం.. అవమానాలు, హేళనల నుంచి, వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం ముఖ్యోద్దేశం’’. 
– సుప్రీంకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సీఆర్‌పీసీ సెక్షన్‌–438 కింద నిందితునికి ముందస్తు బెయిల్‌ మంజూరు చెయ్యొచ్చని స్పష్టంచేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి ఏమాత్రం వీల్లేదని తేల్చిచెప్పింది. నిజానికి.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉందని.. అయితే, ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్‌ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదని పేర్కొంది.  

ఆధారాల్లోకి వెళ్లడం.. మినీ ట్రయల్‌ నిర్వహించొద్దు.. 
‘ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నదానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావొచ్చు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు, ఆరోపణలే నిర్ణయాత్మకమైనవి. ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం, సంబంధంలేని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చేయరాదు. అంతేకాక.. కోర్టులు లోతైన విషయ పరిశీలన చేయడం, మినీ ట్రయల్‌ నిర్వహించడం కూడా చేయడానికి వీల్లేదు’.. అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి. రామకృష్ణ గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ‘సుప్రీం’ తీర్పు సారాంశం ఏమిటంటే..  

అవమానాల నుంచి రక్షణ కోసమే ఎస్సీ, ఎస్టీ చట్టం.. 
ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌–18 నిబంధనలను పరిశీలిస్తే, ఈ చట్టాన్ని తీసుకొచి్చన ఉద్దేశం ప్రస్ఫుటమవుతోంది. ఈ నిబంధనలు కఠినమైనవిగా ఉన్నా, అవి రాజ్యాంగం ప్రతిపాదించిన సామాజిక న్యాయసూత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అలాగే, షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ జాతుల ప్రజలు కూడా సమాజంలో ఇతర అన్నీ వర్గాల్లాగే సమాన స్థాయిలో ఉండేలా చేస్తున్నాయి. సెక్షన్‌–18 నిబంధనలను, తదనుగుణ నిషే­ధం, పార్లమెంట్‌ ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిన ఉద్దేశాన్ని కలి­పి చూడాల్సి ఉంటుంది.

షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ జా­తు­ల సామాజిక ఆరి్థక పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను అమలుచేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలు సుదీర్ఘకాలంగా సమాజంలో అణగారిన వ­ర్గాలుగా ఉన్న నేపథ్యంలో వారికి తగిన రక్షణ కల్పించడం కూడా ఈ చట్టం ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలు పౌర హక్కులను కో­ల్పో­కుండా ఉండటం, అవమానాలు, హేళనల నుంచి, వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం ముఖ్యోద్దేశం. 

చట్టపరమైన నిషేధాన్ని హైకోర్టు విస్మరించింది.. 
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌–438 (ముందస్తు బెయిల్‌ మంజూరు) వర్తింపుపై మినహాయింపు ఉంది. దీంతో ఈ చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అందువల్ల ఆ వ్యక్తి ముందస్తు బెయిల్‌ పొందే ప్రయోజనం పూర్తిగా తొలగించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి ఓ వ్యక్తికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేసింది.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను చదవగానే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరం జరిగినట్లు అర్థమవుతోంది. అయితే, హైకోర్టు మాత్రం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, అందులో కొన్ని వైరుధ్యాలున్నాయని తేల్చిది. వీటి ఆధారంగా నేరం జరగలేదని నిర్ణయించింది. ఇది తప్పు. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదన్న నిషేధాన్ని సైతం హైకోర్టు విస్మరించింది. అందువల్ల హైకోర్టు తీర్పును రద్దుచేస్తున్నాం. అలాగే నిందితునికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దుచేస్తున్నాం.  
నిందితులకు ముందస్తు బెయిలిచ్చిన బాంబే హైకోర్టు.. 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదంటూ రాజ్‌కుమార్‌ జైన్, మరికొంతమంది గ్రామస్తులు చూస్తుండగానే తమ­ను కులం పేరుతో దూషించి, దాడిచేశారంటూ కిరణ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర, ధారా­షివ్‌ జిల్లా, పరండా పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు­లో రాజ్‌కుమార్‌ జైన్‌ తదితరులు కింది కోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయి­ల్‌ నిరాకరించింది. దీంతో.. వారు హైకో­ర్టును ఆశ్ర­యిం­చారు. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు, ప్ర­త్య­క్ష సాక్షుల వాంగ్మూలాలకు మధ్య వ్యత్యాసం ఉందంటూ రాజ్‌కుమార్‌ జైన్‌ తదితరులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.      

బాంబే హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు..
దీనిపై బాధితుడు కిరణ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సీఆర్‌పీసీ సెక్షన్‌–438 కింద నిందితునికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే మాత్రం ఎస్సీ, ఎస్టీ  చట్టం కింద ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి ఏమాత్రం వీల్లేదంది. ఈ కేసులో బాధితుడిని రాజ్‌కుమార్‌ జైన్‌ తదితరులు బహిరంగంగానే కులం పేరుతో దూషించారని, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తేనే ఈ విషయం అర్ధమైపోతోందని తెలిపింది. అందువల్ల రాజ్‌కుమార్‌ జైన్‌ తదితరులకు ముందస్తు బెయిలిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన తీర్పును రద్దుచేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement