అమరరాజాకిచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవచ్చు 

Supreme Court approves APPCB on Amara Raja Batteries - Sakshi

ఏపీపీసీబీకి సుప్రీంకోర్టు అనుమతి 

గతంలో ఇచ్చిన స్టే ఆదేశాల సవరణ  

సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు పాటించలేదంటూ అమరరాజా బ్యాటరీస్‌కు ఇచ్చిన షోకాజు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి  సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఈ మేరకు సవరించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ అమరరాజా బ్యాటరీస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

అమరరాజా తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పదేపదే తనిఖీల పేరిట ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు జారీచే­శారని చెప్పారు. పిటిషనర్‌ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అని, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాల జోలికి వెళ్లొద్దని సూచించింది. తనిఖీలు తప్పేంకాదని, షోకాజు నోటీసులకు స్పం­దించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఐఐటీ–మ­ద్రాస్‌ ఇచ్చిన నివేదిక కూడా పట్టించుకోలేదని రోహత్గి తెలిపారు. షోకాజు నోటీసులకు స్పందించామని పేర్కొన్నారు. ఏపీపీసీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. షోకాజు నోటీసులకు స్పందించారని, అయితే పదేపదే వాయిదాలు కోరారని, అంతకు మించి ఏమీలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించారనిపిస్తే తొలిసారే చర్యలు తీసుకోవాల్సిందని ధర్మాసనం పేర్కొంది.

షోకాజు నోటీసుకు స్పందించడానికి పలుసార్లు సమయం ఇచ్చామని నాదకర్ణి తెలిపారు. ఇలా సమయం అడుగుతూనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తమ చేతులు కట్టేసిందని చెప్పారు. అనంతరం ధర్మాసనం షోకాజు నోటీసులపై తామెలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అథారిటీకి ఉందని తెలిపింది. ‘షోకాజు నోటీసులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తదు­పరి చర్యలు తీసుకోవచ్చు.

అమరరాజా సంస్థ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలి. ఆ వాదనలపై మండలి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఆ నిర్ణయాన్ని నాలుగు వారా­లపాటు నిలుపుదల చేయాలి. తదుపరి ఏమైనా ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవడానికి వాద­ప్రతివాదులకు స్వేచ్ఛనిస్తున్నాం..’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top