
గంజాయి కేసుల్లో అరెస్టు అవుతున్న విద్యార్థులు
తాజాగా తెనాలిలో పట్టుబడిన 11 మందిలో ఇద్దరు స్టూడెంట్లు
5.20 కిలోల గంజాయి స్వాధీనం
తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం.
రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్‌కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు.
ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు.
నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.