సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.
ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.
అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్‌ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్‌నూ చెక్ చేస్తుంది. కంటెంట్‌ను మూడు విధాలుగా (లెవెల్స్) విభజిస్తుంది.
➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది
➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది
➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుంది
డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్‌ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు.
కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్‌ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్‌బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్‌ఫేక్ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.
అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్‌ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్‌లో ఉంది.


