
డాక్టర్ ముక్కు పగలగొట్టి.. మహిళా వైద్యులపై అసభ్య ప్రవర్తన
మద్యం మత్తులో దాడికి తెగబడినట్టు నిర్ధారించిన వైద్యులు
నిందితులను అరెస్టు చేయాలని జూనియర్ డాక్టర్ల ధర్నా
పోలీసుల హామీతో ధర్నా విరమణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై ఇంజినీరింగ్ విద్యార్థులు శనివారం దాడిచేశారు. దీంతో వైద్యులు విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి తమ స్నేహితుడి చేయికి గాయమైందని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చారు. అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యుడు పరిశీలించి స్కానింగ్ చేయించుకోవాలని రాశారు. దెబ్బతగిలిన విద్యార్థితోపాటు వచ్చిన స్నేహితులు ఆస్పత్రిలోనే ఉన్న స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా రేడియాలజిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించారు.
దీంతో ఆమె వెంటనే సెల్ ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు ఆమెను ‘ఏం చేసుకుంటావో చేసుకో, బయటకు వస్తావు కదా నీ కథ చూస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఉద్యోగి స్కానింగ్ తీసి క్యాజువాలిటీకి వెళ్లాలని సూచించారు. రిపోర్ట్ తీసుకొని తిరిగి గుంపుగా క్యాజువాలిటీకి వచ్చిన విద్యార్థులు వైద్యులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ అరుస్తూ హడావుడి చేశారు.
దీంతో గాయపడిన విద్యార్థి వద్ద ఒకరు ఉండి మిగిలినవాళ్లు బయటకు వెళ్లాలని డ్యూటీ వైద్యుడు సూచించారు. తమనే బయటకు వెళ్లమంటావా అంటూ విద్యార్థులు ఆ వైద్యుడి ముక్కు పగలగొట్టారు. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లపైనా సుమారు 15 మంది విద్యార్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. వైద్యులను గాయపరిచారు. ఈ ఘటనతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో పరుగులు తీశారు.
జూనియర్ డాక్టర్ల నిరసన
నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. దాడికి పాల్పడిన మొగిలేశ్వర్, షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్‌పై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఈ నెట్టికంఠయ్య తెలిపారు.