కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది పుంజు యజమాని ఆవేదన. తన పుంజును ఎందుకు కొట్టావని ప్రశి్నస్తే.. అతని కుటుంబ సభ్యులంతా కలసి అకారణంగా దూషించారట.
దీంతో పుంజు యజమాని.. పెట్ట కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలువలపల్లి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పక్క పక్క ఇళ్లలో నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం ఒకరికి చెందిన పుంజు, మరొకరికి చెందిన పెట్ట వద్దకు ప్రకృతి సిద్ధంగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. మరి ఈ పంచాయితీని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి.


