Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు

Stable shrimp prices in AP - Sakshi

ఆక్వా రైతులు దళారుల ఉచ్చులో పడొద్దు

కోవిడ్‌ను సాకుగా చూపి ధరలు తగ్గించి కొనే వ్యాపారులపై సర్కార్‌ ఉక్కుపాదం

మత్స్య శాఖ కమిషనర్‌ కన్నబాబు 

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కోవిడ్‌ పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దళారుల ఉచ్చులో పడి అయినకాడికి అమ్ముకోవద్దని ఆక్వా రైతులను కోరుతోంది. సీ ఫుడ్‌ ఎగుమతిదారుల అసోసియేషన్‌ నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలో మొదటి పంట ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తోంది. రోజుకు ఐదు నుంచి ఆరువేల టన్నుల రొయ్యలు జూన్‌ వరకు మార్కెట్‌కు వస్తాయి. ప్రస్తుతం కౌంట్‌ను బట్టి కిలో రూ.200 నుంచి రూ.340 వరకు ధర పలుకుతోంది.

రోజుకు 15–20 టన్నుల చొప్పున కృష్ణపట్నం, విశాఖ, కాకినాడ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్‌లో రేటు పడిపోయిందని, లాక్‌డౌన్‌ విధిస్తే ఎగుమతులు నిలిచిపోతాయంటూ కొంతమంది దళారులు, వ్యాపారులు దుష్ప్రచారం చేస్తూ రైతుల వద్ద కిలోకి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొంటున్నారు. దీంతో దళారులు, వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇదే సమయంలో ఆందోళనకు గురికాకుండా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

మీడియా ద్వారా ధరలపై విస్తృత ప్రచారం: కమిషనర్‌ కన్నబాబు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఆదివారం ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, కోస్తా జిల్లాల ఆక్వా రైతులు, మత్స్యశాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు కౌంట్‌ వారీగా నిర్ధారించే ధరలను మీడియా ద్వారా సీఫుడ్‌ ఎగుమతిదారుల అసోసియేషన్‌ విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారుల సమాచారం జిల్లా మత్స్యశాఖాధికారులకు ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉన్నాయని, తగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top