మృత్యువై దూసుకొచ్చిన కారు | Sakshi
Sakshi News home page

మృత్యువై దూసుకొచ్చిన కారు

Published Mon, Apr 11 2022 6:18 PM

Srungavarapu Kota: Three People of Same Family killed Speeding Car Skids Off Road - Sakshi

వేసవి సేద తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న తాటి ముంజుల విక్రయదారుడు వద్ద ఆగిన ఆ తండ్రి కొడుకులను కారు మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మరో ముగ్గురిని తీవ్ర గాయాల పాల్జేసింది. శ్రీరామనవమి పండగ రోజున జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... 

శృంగవరపుకోట రూరల్‌ : ఎస్‌.కోట మండలం కిల్తంపాలెం సమీపంలోని రాజీపేట జంక్షన్‌ వద్ద ఉన్న సిమెంటు ఇటుక పరిశ్రమ వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యు ఒడికి చేరగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎస్‌ఐ జి.లోవరాజు తెలిపిన వివరాలు... విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురం గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కమ్‌ వార్డెన్‌గా పనిచేస్తున్న కిల్లో సోనాపతి స్వగ్రామం ఇదే మండలంలోని కోనాపురం. 

ఈయన ఎస్‌.కోట పట్టణం పందిరప్పన్న జంక్షన్‌ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సోనాపతి తన భార్య శ్రావణి, పిల్లలు కిల్లో శ్రావణ్‌(7), కిలో సుహాస్‌(4)తో ద్విచక్ర వాహనంపై శివలింగపురం అత్తారింటికి బయలుదేరాడు. మార్గంలో రాజీపేట జంక్షన్‌ సమీపంలో ఇటుక పరిశ్రమ వద్ద రోడ్డు పక్కన తాటిముంజులు తినేందుకు ఆగారు. వీరితో పాటు ఎస్‌.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసర సహిత, కొసర అప్పారావు బొడ్డవర వెళ్తూ తాటిముంజుల కోసం ఆగారు. ఇంతలో అరకు వైపు నుంచి అతివేగంగా వస్తున్న కాకినాడకు చెందిన ఏపీ 05 డీవీ 0579 నంబరు గల కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో అదుపుతప్పి  కుడి వైపున ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆ పక్కనే తాటిముంజులు తింటున్న వారిని ఢీకొని పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు కిల్లో సోనాపతి(38), కిల్లో శ్రావణ్, కిలో సుహాస్‌ మృతి చెందారు. 

ప్రమాద స్థలంలోనే శ్రావణ్, సుహాస్‌ మృతి చెందగా వీరి తండ్రి సోనాపతి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందారు. ఈయన భార్య కిల్లో శ్రావణి విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదఖండేపల్లికి చెందిన సహిత తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉంది. సహిత తండ్రి బొడ్డవర రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ కొసర అప్పారావు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కాగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.  ఇదిలా ఉండగా కాకినాడకు చెందిన వారు ఫోటోషూట్‌ కోసం అరకు, ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. 

సంఘటనా స్థలానికి ఎమ్మెల్సీ రఘురాజు 
ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎస్‌ఐ, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీ ఎదురుగా రోడ్డుపై ఉన్న చిన్న గుంత వల్లే పలు ప్రమాదాలు జరిగాయన్న సంగతి తెలిసి గుంతను పూడ్చి వేసే పనులు చేపట్టాలని సర్పంచ్‌ సుంకరి ఈశ్వరరావు, గ్రామ పెద్దలకు సూచించారు.   

ఆస్పత్రిలో ఆర్తనాదాలు 
ప్రమాదంలో  ఉపాధ్యాయుడు సోనాపతి, ఆయన కుమారులు మృతి చెందారన్న సమాచారం తెలిసి న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎస్‌.కోటలోని సీహెచ్‌సీకి చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. సోనాపతి వృత్తిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. 

Advertisement
Advertisement