అమ్మ సన్నిధిలో టీడీపీ నేతల దౌర్జన్యకాండ  | sri vasavi kanyaka parameswari temple guntur | Sakshi
Sakshi News home page

అమ్మ సన్నిధిలో అరాచకం

Jan 30 2025 8:12 AM | Updated on Jan 30 2025 8:12 AM

sri vasavi kanyaka parameswari temple guntur

వాసవీమాత గుడిలో టీడీపీ నేతల దౌర్జన్యకాండ 

ఆలయ కమిటీని పక్కనబెట్టి పెత్తనం 
 
యథేచ్ఛగా ప్రొటోకాల్‌  ఉల్లంఘన 

ఆత్మార్పణ దినం పేరిట వసూళ్ల పర్వం 

పట్టించుకోని దేవదాయశాఖ

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌) : వాసవీకన్యకా పరమేశ్వరి అమ్మ సన్నిధిలో టీడీపీ నేతలు అరాచకానికి తెగబడుతున్నారు. ఆలయ కమిటీపై దౌర్జన్యం చేస్తున్నారు. యథేచ్ఛగా ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తూ కమిటీని పక్కనబెట్టి పెత్తనం సాగిస్తున్నారు. అయినా దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారం వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి వందేళ్లపైబడి చరిత్ర ఉంది. పూర్వం నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు  చేపడుతున్నారు. ఏటా ఆలయంలో అమ్మ ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాదీ ఈనెల 31న దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తెలుగుదేశం నేతలు తలదూర్చి పెత్తనం సాగిస్తున్నారు. ఆలయ పాలక మండలితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆలయ అధికారులకూ విలువ ఇవ్వడం లేదు. వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట నిత్యం జరిగే అన్నదానానికీ అడ్డుతగిలారు.

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేయాలని తలంచడంతో టీడీపీ నేతలు జోక్యం చేసుకున్నారు. అన్నదానం జరగడానికి వీలు లేదని ఆపేశారు. అప్పటి నుంచి అన్నదానం జరగనీయడం లేదు. గతంలో రోజూ ఇక్కడ 300 నుంచి 400 మంది ఆకలి తీర్చుకునేవారు. పాపమని తెలిసి కూడా టీడీపీ నేతలు పేదల  ఉసురుపోసుకున్నారు. 


 
అధికార లాంఛనమా..! అధికార పార్టీ లాంఛనమా..? 
ఆలయంలో ఆత్మార్పణ దినోత్సం పేరు చెప్పి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా వాట్సాప్‌ల్లో పూజల కోసం రూ.5,500 చెల్లించాలంటూ భక్తులకు మెసేజ్‌లు పెడుతున్నారు. భారీగా వసూళ్లకు తెగబడుతున్నారు. దీంతోపాటు ఆ రోజు అన్నదానం, ప్రసాదాల పంపిణీ, డెకరేషన్‌లు, ఇతరరత్రా కార్యక్రమాల పేరిట కూడా అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ నేతల తీరుతో ఆర్యవైశ్య ప్రముఖులు విసిగిపోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే టీడీపీ నేతల ఆగడాలకు ప్రజాప్రతినిధులు, దేవదాయ శాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల తీరు అధికారపార్టీ లాంఛనంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.  

నా దృష్టికి రాలేదు  
అనధికారికంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారనేది నా దృష్టికి రాలేదు. దీనిపై ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటాం. అక్రమ వసూళ్ల విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు.  
– జి.మాధవి, ఏసీ, దేవదాయశాఖ  

సంబంధం లేని వ్యక్తుల పేర్లతో కరపత్రాలు  
ఆలయంలో పెత్తనం సాగిస్తున్న టీడీపీ నేతలకు ఎటువంటి అధికారం లేదు. గుడికి, వారికి అసలు సంబంధం లేదు. అయినా దేవదాయ శాఖ అధికారులు మౌనం దాలుస్తున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈ నెల 31వ తేదీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ముద్రించిన కరపత్రాల్లోనూ ముందుగా టీడీపీ నేతల పేర్లు వేయించుకున్నారు. ఆ తర్వాత ధర్మకర్తల మండలి, ఆలయ అధికారి పేర్లు ముద్రించారు. దీనిపై ఆర్యవైశ్య ప్రముఖులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.గుడికి ఏ సంబంధం లేని వ్యక్తులు ఎలా పెత్తనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement