గుంటూరు లీగల్: ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండో అదనపు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ వై.నాగరాజా ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 41 బెంచ్‌లు, గుంటూరు జిల్లా కోర్డు ప్రాంగణంలో 15 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ ద్వారా సివిల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ కుదుర్చారు. 2009నాటి కేసులో ఇరువర్గాల అంగీకారంతో రూ.2,68,60,000 రాజీ కుదిర్చా రు. రెండో అదనపు జిల్లా కోర్టులో ఒక సివిల్ దావాలో రూ.25కోట్లకు రాజీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బార్ మెంబర్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలోని వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. మొత్తం 24,756 కేసులు పరిష్కరించగా, వీటిలో సివిల్ కేసులు 1,694, క్రిమినల్ కేసులు 22,983, ప్రీ లిటిగేషన్ కేసులు 79, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులలో పరిష్కారమైన మొత్తం కేసుల విలువ మొత్తం విలువ రూ.42,58,65,889. జాతీయ లోక్ అదాలత్ ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహణకు సహకరించిన న్యాయవాదులకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు.


