గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సలీమ్ బాషా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 490 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రా లను సిద్ధం చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో 27,214 మంది రెగ్యులర్, 485 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారని వివరించారు. పరీక్ష కేంద్రా ల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో పాటు 1,714 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నా రని చెప్పారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశామని, పరీక్ష కేంద్రాల్లో నిఘాతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు రూట్ అధికారులు, అసిస్టెంట్ రూట్ అధికారులు, స్క్వాడ్‌లను నియమించినట్లు చెప్పా రు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. పాఠశాలల్లో హెచ్‌ఎంల నుంచి పొందిన హాల్ టికెట్, వెబ్‌సైట్, వాట్సాప్ మార్గాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చని, హాల్ టికెట్లపై హెచ్‌ఎం సంతకం, స్టాంప్ అవసరం లేదన్నారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్‌తో వస్తే చాలని స్పష్టంచేశారు. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, పరీక్ష రాసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేందుకు హాల్ టికెట్ చూపించి, ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమాచారం చేరవేసేందుకు, సందేహాల నివృత్తికి జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలోకె.వెంకట్‌రెడ్డి (89782 13998), కె.శివనాగేశ్వరరావు(9347310671),టి.రామయ్య (99513 97109)లతో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లకు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగ జిల్లా సహాయ కమిషనర్ కె.వెంకట్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఏ తిరుమలేష్ పాల్గొన్నారు.
● డీఈఓ షేక్ సలీమ్ బాషా
● పరీక్ష కేంద్రాలకు గంట
ముందుగానే చేరుకోవాలి
● ఆర్టీసీ బస్సులో ఉచితంగా
పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు
● రేపటి నుంచి ప్రారంభం కానున్న
టెన్త్ పబ్లిక్ పరీక్షలు
● గుంటూరు జిల్లాలో హాజరు కానున్న
27,699 మంది విద్యార్థులు
● జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా ఉన్న 149 పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.