రైతుల అభ్యంతరాలు పరిశీలిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

రైతుల అభ్యంతరాలు పరిశీలిస్తాం..

Mar 15 2026 5:08 AM | Updated on Mar 15 2026 5:08 AM

రైతుల అభ్యంతరాలు పరిశీలిస్తాం.. ●

రహదారులకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు

కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి

చోడవరం రీచ్‌ పరిశీలన

ఆర్డీఓ రాకతో భారీగా చేరుకున్న రైతులు

తాడేపల్లిరూరల్‌: రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని, ఉన్నతాధికారులకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామని కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. కృష్ణా జిల్లా చోడవరంలోని లంక భూముల్లో మేట పేరిట తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ‘మేట... బడాబాబులకు మేత’ శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి వివిధ శాఖల అధికారులతో కలసి చిర్రావూరు వైపు లంక భూములను పరిశీలించేందుకు మధ్యాహ్నం సమయంలో విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు అక్కడకు చేరుకున్నారు. లంక భూమి భౌతిక స్వరూపాన్ని ఆర్డీఓ శ్రీదేవికి వివరించారు. గతంలో అనుమతులు ఇచ్చిన ఇసుక రీచ్‌ల వల్లే వేలాది లంక భూములు కృష్ణానదిలో కొట్టుకుపోయాయని, పట్టా భూములు ఉన్న రైతులు కౌలు రైతులుగా మారారని తెలిపారు. చోడవరం ఇసుక రీచ్‌–2తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను అనుమతి ఇస్తే మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావూరు, రామచంద్రాపురం, గొడవర్రు, ఇతర ప్రాంతాల్లో లంక భూములతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయని పేర్కొన్నారు. సొసైటీల కింద ఎంతో మంది వ్యవసాయం చేసుకుంటున్నారని, మట్టి తీసుకోవడానికి అనుమతి ఇస్తే చిన్నపాటి రైతులు తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుందని, అందువలన అనుమతులు ఇవ్వవద్దంటూ వారు కోరారు. సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, కాశయ్యలు మాట్లాడుతూ లంక భూముల తవ్వకాల విషయంలో రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.

చోడవరం–2 ఇసుక రీచ్‌తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను మైనింగ్‌ శాఖ అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని ఇరిగేషన్‌ శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ దినేష్‌ తెలిపారు. ఇరిగేషన్‌ శాఖ నుంచి ఇప్పటి వరకు రహదారి నిర్ణయించలేదని, డిస్ట్రిక్‌ శాండ్‌ నిబంధనల ప్రకారం ఏ జిల్లాలో ఇసుక రీచ్‌లు నిర్వహిస్తే ఆ జిల్లాలోనే అనుమతులు ఇస్తారని అన్నారు. అనుమతులు ఇవ్వకుండా గుంటూరు జిల్లా లోని కృష్ణానదిలో రహదారులు ఎలా నిర్మించారని రైతులు ప్రశ్నించగా ఆయన మాట దాటవేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement