ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

Special measures for the welfare of RTC workers - Sakshi

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్‌ వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ డిపో ప్రారంభం

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన రామచంద్రపురం డిపోను మంత్రి నాని ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయినప్పటికీ వివిధ యూనియన్లు కార్మికులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కార్మికులకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందించడంతోపాటు ఆరోగ్య కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్‌ కావాల్సిన ఉద్యోగులను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయడం, పెన్షన్‌ సౌకర్యం ఇంకా మెరుగుపర్చడం వంటి విషయాల్లో ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ విషయాన్ని కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు.

ఏపీ నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపే కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రామచంద్రపురంలో కొత్త డిపో ఏర్పాటు చేశామన్నారు. బస్సుల పార్కింగ్, డ్రైవర్లకు వసతి సౌకర్యం కల్పించేందుకు అనువుగా సుమారు రూ.16 కోట్లు వెచ్చించి విశాలమైన ప్రాంగణంలో ఈ డిపో నిర్మించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అందుకు కృతజ్ఞతగా సిబ్బంది సంస్థ పురోగతికి కృషి చేయాలని కోరారు. సిబ్బంది అంతా ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించి ప్రభుత్వానికి గౌరవం తీసుకురావాలన్నారు. ఉద్యోగుల పే ఎరియర్స్‌ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) ఎ.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి, సీఏవోఎన్‌ వి.రాఘవరెడ్డి, చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్, దూర ప్రాంత సర్వీసుల అధికారి నాథ్, ఏటీఎం సుధాకర్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top