మసాజు మాటున 'గలీజు' | Spa centers are becoming some anti social activities | Sakshi
Sakshi News home page

మసాజు మాటున 'గలీజు'

Jul 24 2025 4:03 AM | Updated on Jul 24 2025 4:03 AM

Spa centers are becoming some anti social activities

స్పాముసుగులోవ్యభిచారం

విదేశాల నుంచి యువతుల దిగుమతి 

ఇన్‌స్టా, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా హైటెక్‌ వ్యాపారం 

విశాఖలోని పోలీసుల దాడులతో  బట్టబయలు 

ఇప్పటికే రెండు స్పాలపై చర్యలు మిగిలిన వాటిపై పోలీసుల నిఘా 

విశాఖ సిటీ : విశాఖ హైటెక్‌ వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది. స్పా సెంటర్ల ముసుగులో గలీజు వ్యవహారం సాగుతోంది. మసాజు మాటున వ్యభిచారం నడుస్తోంది. సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్‌ యాప్‌ల ద్వారానే దందా జరుగుతోంది. వెల్‌నెస్‌.. స్పా సెంటర్ల పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేంద్రాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి నిర్వాహకులు కొందరు విదేశాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటూ.. వారితో చీకటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. 

సోషల్‌ మీడియాలో ఆకర్షణీయమైన యాడ్స్‌ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. అన్ని రకాల సేవలను అందిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా స్పా సెంటర్లపై పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి వీటిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. గత వారంలో వరుసగా రెండు స్పా సెంటర్లపై చేసిన దాడుల్లో వారి మసాజ్‌ బాగోతం బయటపడింది. 

హైటెక్‌ దందా  
సామాజిక మాధ్యమాల ద్వారానే 80 శాతం హైటెక్‌ వ్యభిచారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పలువురు నిర్వాహకులు లొకేంటో, ఇన్‌స్టా, టెలీగ్రామ్, వాట్సాప్‌.. ఇలా సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్‌ యాప్‌ను వినియోగించుకుంటున్నారు. వీటిలో డిజిటల్‌ యాడ్స్‌ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. వాటిలో ఉన్న నెంబర్‌కు మెసేజ్‌ చేస్తే చాలు. వెంటనే ఆటో జనరేటెడ్‌ రిప్లయ్‌ వచ్చేస్తుంది. 

ఎటువంటి సేవలు అందిస్తారన్న వివరాలు అందులో ఉంటాయి. మరో నిమిషంలోనే ఫోన్‌ మోగుతుంది. మధురమైన వాయిస్‌తో వారి అందించే సేవలు, వారి చార్జీలు వివరిస్తారు. ఓకే అంటే చాలు.. వెంటనే లొకేషన్‌ మొబైల్‌కు వచ్చేస్తుంది. ఇదీ విశాఖలో సాగే హైటెక్‌ వ్యభిచారం. సాధారణ మసాజ్‌లకు రూ.1000 నుంచి రూ.2500 ఛార్జ్‌ చేస్తున్నారు. అయితే క్రాస్‌ మసాజ్‌ నుంచి ప్రత్యేక సేవలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సేవలు కావాలంటే రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు.  

విశాఖలో 71 స్పా సెంటర్లు 
ఆకర్షణీయమైన ఎంట్రన్స్‌.. లోపల అడుగుపెడితే అద్భుతమైన యాంబియన్స్‌.. అందమైన యువతులతో స్వాగతాలు.. స్టార్‌ హోటల్‌ను తలపించే రూమ్‌లు.. ఇలా నగరంలో ఇలా రూ.కోట్లు ఖర్చు పెట్టి స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 71 వరకు ఈ వెల్‌నెస్, స్పా, రిలాక్స్‌ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిరిపురం, పాండురంగాపురం, బీచ్‌ రోడ్డు, సీతమ్మధార, గాజువాక ప్రాంతాల్లోనే సగం కంటే ఎక్కువగా సెంటర్లు ఉన్నాయి. 

వీటిలో కొన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. విదేశాల నుంచే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటున్నారు. శరీరం అలసిపోయిన, కండరాలు బిగుసుకుపోయిన వారికి అనేక రకాల మసాజ్‌ సేవలు అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ లోపల జరిగే తంతే వేరుగా ఉంటోంది. చట్ట విరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

నెలవారీ మామూళ్లు.. 
స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారానికి పోలీసుల నుంచి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంలో ఒక్కో స్పా సెంటర్‌ నుంచి నెలకు రూ.10 వేలు స్టేషన్‌కు అందుతున్నట్లు సమాచారం. అసాంఘిక కార్యకలాపాలు సాగించే సెంటర్ల నుంచి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు ముట్టజెబుతున్నారన్న టాక్‌ ఉంది. అందువల్లే ఇన్నాళ్లు ఆ స్పా సెంటర్ల వ్యవహారం బయటపడలేదన్న వాదనలు ఉన్నా­యి.

వీటి నిర్వహణ, చట్ట విరుద్ధ కార్యక్రమాలపై అనేక ఫిర్యాదులు రావడంతో సీపీ శంఖబ్రత బాగ్చి గతంలో ప్రతి 2,3 నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అన్ని కేంద్రాల్లో  దాడులు చేపట్టినా ఒక్క కేంద్రంలోనూ ఈ తరహా వ్యవహారం వెలుగు చూడలేదు. తనిఖీలకు వెళుతు­న్న సమాచారం నిర్వాహకులకు ముందుగానే అందుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా.. 
కూటమి ప్రభుత్వంలో విశాఖలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. హత్యలు, గ్యాంగ్‌వార్‌లు, దాడులు, దోపిడీలతో ప్రశాంత విశాఖలో అలజడి రేగుతోంది. తాజాగా ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం వ్యవహారం బట్టబయలవడం నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. గత వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రెండు స్పా కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement